పాత ప్రాజెక్టులకు 6 వేల కోట్లు  పెంచిన్రు

పాత ప్రాజెక్టులకు 6 వేల కోట్లు  పెంచిన్రు
  • ప్రాజెక్టుల ఖర్చు భారీగా పెంచేశారు
  • కేబినెట్‌‌ ఆమోదంతో జీవో జారీ
  • పెండింగ్‌‌లో ఉన్న 61 ప్యాకేజీలకు వర్తింపు 

హైదరాబాద్‌‌, వెలుగు :పాత ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చును సర్కారు మరోసారి భారీగా పెంచింది. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల్లోని పెండింగ్‌‌ పనులకు ప్రస్తుత ధరలతో చెల్లింపులు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. స్టీల్‌‌, సిమెంట్‌‌, ఇంధనం, మెటీరియల్‌‌, లేబర్‌‌ చార్జీల పెంపునకు కేబినెట్‌‌ ఓకే చెప్పడంతో రూ.4 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి వస్తోంది. తెలంగాణ ఏర్పడిన వెంటనే ఈ పనులు చేపట్టి ఉంటే ప్రజలపై ఆరు వేల కోట్లకు పైగా భారం తప్పేది. పెండింగ్‌‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సోయి కేసీఆర్‌‌ సర్కారుకు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2004లో జలయజ్ఞంలో భాగంగా పలు ప్రాజెక్టులను చేపట్టింది. ఈ ప్రాజెక్టుల పనులు ఉమ్మడి ఏపీలో కొంత వరకు పూర్తి కాగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి. 25 మేజర్‌‌, మీడియం సాగునీటి ప్రాజెక్టుల్లో కలిపి 111 ప్యాకేజీలు పెండింగ్‌‌లో ఉండగా, కొన్ని ప్రాజెక్టులను రీ డిజైన్‌‌ చేయడంతో వాటికి సంబంధించిన కొన్ని ప్యాకేజీలను పూర్తిగా పక్కన పెట్టారు. 

ఆయా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో 2015లో రాష్ట్ర సర్కార్​చర్చలు జరపగా 2005 నాటి ధరలతో పనులు చేయలేమని తేల్చిచెప్పారు. దీంతో ప్రభుత్వం 2015 అక్టోబర్‌‌‌‌లో ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్‌‌‌‌లో ఉన్న ప్యాకేజీలు పూర్తి చేసేందుకు అప్పుడు అమల్లో ఉన్న ధరలకు అనుగుణంగా చెల్లింపులు చేస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2015 నాటికి రూ.6 వేల కోట్ల పనులు పెండింగ్‌‌‌‌లో ఉన్నట్టు గుర్తించి, వాటికి అప్పటి ధరల ప్రకారం రూ.11 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ఐదేళ్లలో కొన్ని ప్యాకేజీలను పూర్తి చేయగా, ఇంకో 61 ప్యాకేజీల పనులు పెండింగ్‌‌‌‌లో ఉండిపోయాయి.
దాదాపు మూడు రెట్లు పెంపు
జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులను ఏడాదిన్నరలోగా పూర్తి చేయకుంటే సిమెంట్‌‌‌‌, స్టీల్‌‌‌‌, ఇంధన ధరలు పెరిగిన రేట్ల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో ప్రకారం స్టీల్‌‌‌‌, సిమెంట్‌‌‌‌, ఇంధన ధరలతో పాటు లేబర్‌‌‌‌, మెటీరియల్‌‌‌‌ చార్జీలను ప్రస్తుత ధరల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. 2015తో పోల్చితే ఈ ఆరేళ్లలో సిమెంట్‌‌‌‌, స్టీల్‌‌‌‌, ఫ్యూయల్‌‌‌‌, లేబర్‌‌‌‌ చార్జీలు, ఇతర మెటీరియల్‌‌‌‌ ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి. పెండింగ్‌‌‌‌లో ఉన్న 61 ప్యాకేజీల్లో రూ.4 వేల కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. వర్క్‌‌‌‌ ఏజెన్సీలు వాటిని పూర్తి చేస్తే ప్రస్తుత ధరల ప్రకారం రూ.10 వేల కోట్లకు పైగానే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని ఇరిగేషన్‌‌‌‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే..
దేవాదుల, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతలు, సింగూరు కాలువలు, ఇందిరమ్మ వరద కాలువ, ఎస్సారెస్పీ స్టేజీ-2 ప్రాజెక్టులకు సంబంధించిన పనులు పెండింగ్‌‌‌‌లో ఉండటానికి కారణం సర్కారు నిర్లక్ష్యమే. ఈ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణ చేపట్టలేదు. నిర్వాసితులకు ఆర్‌‌‌‌ అండ్‌‌‌‌ ఆర్‌‌‌‌ ప్యాకేజీ వర్తింపజేయలేదు. దీంతో నిర్వాసితులు ఖాళీ చేయక పనులు చేయలేకపోయారు. మొత్తంగా ఈ 61 ప్యాకేజీలకు సంబంధించిన పనులు పూర్తి చేయాలంటే 16,905 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ భూమికి పరిహారంతో పాటు నిర్వాసితులకు పునరావాసం ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. గతంలో చేపట్టిన భూసేకరణకు సంబంధించి రూ.వంద కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అప్పుడే భూసేకరణ  చేసి, పునరావాస ప్యాకేజీ ఇచ్చి ఉంటే సర్కారుకు పెద్ద ఆర్థిక భారం తప్పేది.  కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే ఎజెండాతో పనిచేసిన ప్రభుత్వం ఈ పనులు పూర్తిగా విస్మరించి ఇప్పుడు వేల కోట్ల సంతర్పణకు సిద్ధమైంది.
పూర్తి చేయాల్సిన పనులు ఇవే..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని 28 నుంచి 30 ప్యాకేజీలు, ఇదే ప్రాజెక్టు పరిధిలోని థర్డ్‌‌‌‌ స్టేజీ, భీమా లిఫ్ట్‌‌‌‌ స్కీంలోని 13, 14, 18, 21, 22, 27, 46, నెట్టెంపాడు ఎత్తిపోతల పరిధిలోని 98, 99ఏ ప్యాకేజీలు, 100, 104 నుంచి 109 వరకు ప్యాకేజీలు,  సింగూరు కాల్వలు, దేవాదుల ఫేజ్‌‌‌‌ -2 పరిధిలోని ఘన్‌‌‌‌పూర్‌‌‌‌, 4ఎల్‌‌‌‌ డిస్టీ, అశ్వారావుపల్లి, తపాస్‌‌‌‌పల్లి, ప్యాకేజీ 3 నుంచి 8 వరకు, దేవాదుల ఫేజ్‌‌‌‌-1లోని సీ2 -45, సీ2 -46, దేవాదుల ఫేజ్‌‌‌‌ -3 పరిధిలోని రెండో ప్యాకేజీ, ఎస్సారెస్పీ స్టేజీ -2లోని 53, సీ2-54, సీ2-58 ప్యాకేజీలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని గ్రావిటీ కెనాల్‌‌‌‌, కెనాల్‌‌‌‌ (ప్యాకేజీ 1), కెనాల్‌‌‌‌ (ప్యాకేజీ 3), స్టేజ్‌‌‌‌ -2లోని ఫేజ్‌‌‌‌ 1, కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌‌‌‌ పనులు, మంథని లిఫ్టు స్కీముల పనులు పూర్తి చేయాల్సి ఉంది. నీల్వాయి ప్రాజెక్టు పరిధిలోని 12, పెద్దవాగు పరిధిలోని 19, పాలేంవాగు పరిధిలోని ఏడు, కోయిల్‌‌‌‌సాగర్‌‌‌‌ స్టేజీ-2, వరద కాలువ పరిధిలో ప్యాకేజీ రెండు నుంచి 8 వరకు, ఏఎమ్మార్పీ పరిధిలోని ఉదయసముద్రం లిఫ్ట్‌‌‌‌ స్కీం, 110 ప్యాకేజీ, ఏఎమ్మార్‌‌‌‌ ఎస్‌‌‌‌ఎల్బీసీ టన్నెల్‌‌‌‌ ప్రాజెక్టు, కుమ్రం భీమ్ ప్రాజెక్టు పరిధిలోని సీ1-18 ప్యాకేజీ, ఎస్సారెస్పీ పరిధిలోని లక్ష్మీ కెనాల్‌‌‌‌, కోనాయమాకుల లిఫ్ట్‌‌‌‌, కోయిల్‌‌‌‌సాగర్‌‌‌‌ లిఫ్ట్‌‌‌‌ కింద స్టేజీ-1 ప్యాకేజీల పనులు చేయాల్సి ఉంది.
నీళ్ల కోసం ఏండ్లుగా ఎదురుచూపులు
దేవాదుల, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు, సింగూరు కాల్వలు, ఇందిరమ్మ వరద కాలువ, ఎస్సారెస్పీ స్టేజీ-2లోని పెండింగ్‌‌‌‌లో ఉన్న 61 ప్యాకేజీలు పూర్తి చేస్తే కొత్తగా 10.63 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. రాష్ట్రం ఏర్పడే నాటికే పెండింగ్‌‌‌‌లో ఉన్న ఈ పనులు పూర్తి చేయడంపై సర్కారు దృష్టి పెట్టలేదు. ఫలితంగా ఆయకట్టుకు రైతులు ఏండ్లుగా నీళ్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.