ఫర్టిలైజర్స్​పై  రైతులకు 60 వేల కోట్ల సబ్సిడీ

ఫర్టిలైజర్స్​పై  రైతులకు 60 వేల కోట్ల సబ్సిడీ

ఫర్టిలైజర్స్​పై  రైతులకు 60 వేల కోట్ల సబ్సిడీ
ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం
డీఏపీ, నైట్రోజన్, పొటాషియం, పాస్పరస్ ఎరువులకు సబ్సిడీ  
డీఏపీపై రూ.2,501 సబ్సిడీ.. రైతులకు రూ. 1,350కే బస్తా

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతులకు ఫర్టిలైజర్స్ ను తక్కువ ధరలకు అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం రూ. 60,939.23 కోట్ల సబ్సిడీకి ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలకు ఈ నిధులను సబ్సిడీ కోసం ఖర్చుచేసేందుకు ఓకే చెప్పింది. కేబినెట్ ఆమోదించిన ‘న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీ(ఎన్బీఎస్) ఖరీఫ్–2022’ స్కీమ్ కింద.. ఈ ఖరీఫ్ సీజన్ లో పొలాలను సారవంతం చేసే నైట్రోజన్, ఫాస్పేట్, పొటాష్, సల్ఫర్ పోషకాలతో కూడిన ఎరువులను అందుబాటు ధరలకే అందించేందుకు సబ్సిడీని ఇవ్వనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. దేశీయంగా తయారయ్యే ఎరువులు, దిగుమతి చేసుకునే డీఏపీపై కూడా సబ్సిడీ ఉంటుందన్నారు. నిరుడు రూ.57,150 కోట్ల సబ్సిడీ అందించగా, ఈసారి రూ.4 వేల కోట్ల మేరకు సబ్సిడీని పెంచినట్లు చెప్పారు. 

డీఏపీ బస్తాపై రూ. 2,501 సబ్సిడీ
ఒక డీఏపీ బస్తా ధర ప్రస్తుతం రూ.3,851 ఉందని, సబ్సిడీ పొందే రైతులు రూ. 1,350కే ఒక బస్తాను పొందొచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. డీఏపీ బస్తాపై ప్రస్తుతం రూ.1,650 సబ్సిడీ ఉండగా.. దానిని రూ. 2,501కి పెంచిందన్నారు. నిరుటితో పోలిస్తే.. సబ్సిడీ 50% పెరిగిందన్నారు. నిరుడు డీఏపీ బస్తాపై రూ.512 సబ్సిడీ ఉండేదని, ఇప్పుడు 5 రెట్లు పెరిగిందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్​లో ఫర్టిలైజర్ల ధరలు పెరిగినా దేశంలో రైతులపై కేంద్రం భారం మోపడంలేదన్నారు.

‘క్వార్’ హైడ్రోప్రాజెక్టుకు రూ. 4 వేల కోట్లు 
జమ్మూకాశ్మీర్​లోని చీనాబ్ నదిపై 540 మెగావాట్ల క్వార్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 4,526.12 కోట్ల నిధులను ఇచ్చేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు 54 నెలల్లో పూర్తవుతుందని, ఏటా 1,975.54 మిలియన్ యూనిట్ల కరెంట్ ను ఉత్పత్తి చేస్తుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,700 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.   

‘పోస్ట్ పేమెంట్స్’ బ్యాంకుకు రూ. 820 కోట్లు 
దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో పేమెంట్స్ సేవలను విస్తరించేందుకు వీలుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)కి రూ. 820 కోట్ల అదనపు ఫండ్స్ ను కూడా కేబినెట్ ఆమోదించిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం 1.56 లక్షల పోస్ట్ ఆఫీసులు ఉండగా, 1.3 లక్షల పోస్ట్ ఆఫీసుల్లో ఐపీపీబీ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. టెక్నికల్ అప్ గ్రెడేషన్ కోసం మరో రూ. 500 కోట్లు ఇచ్చేందుకూ కేంద్రం యోచిస్తోందన్నారు. 

2024వరకూ పీఎం ‘స్వనిధి’
ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) స్కీమ్ ను డిసెంబర్ 2024 వరకూ పొడిగించేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీధి వ్యాపారులకు లోన్ లు ఇచ్చేందుకు తెచ్చిన ఈ స్కీమ్ కింద లోన్ నిధులను రూ. 8,100 కోట్లకు పెంచింది. వెండర్స్ కు డిజిటల్ పేమెంట్స్, క్యాష్ బ్యాక్ వంటి వాటికి బడ్జెట్ ను కూడా పెంచింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా పట్టణాల్లోని 1.2 కోట్ల మంది వెండర్లకు లబ్ధి కలగనుందని కేంద్ర మంత్రి చెప్పారు. 

నక్సల్ ఏరియాల్లో ‘4జీ’కి రూ. 2 వేల కోట్లు  
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 2జీ మొబైల్ సేవలను 4జీ సేవలకు అప్ గ్రేడ్ చేసేందుకు రూ. 2,426 కోట్ల ఫండ్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పది రాష్ట్రాల్లో చేపట్టబోయే ఈ పనులను ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కు అప్పగించారు. మొత్తం 2,542 మొబైల్ టవర్ లను 2జీ నుంచి 4జీకి మార్చనున్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో ఏపీలో 346, తెలంగాణలో 53 టవర్​లను అప్‌‌‌‌ గ్రేడ్ చేస్తామన్నారు.