Ranji Trophy 2025-26: జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక గెలుపు.. 65 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీలో ఢిల్లీపై విజయం

Ranji Trophy 2025-26: జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక గెలుపు.. 65 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీలో ఢిల్లీపై విజయం

ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో భాగంగా జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. రంజీ ట్రోఫీలో ఢిల్లీని ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. 65 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీలో ఢిల్లీపై జమ్మూ కాశ్మీర్ గెలవడం విశేషం. రాజధానిలో ఒక రోజు ముందు జరిగిన పేలుడు తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య మ్యాచ్ జరిగింది. మంగళవారం (నవంబర్ 11) అరుణ్ జైట్లీ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై జమ్మూ కాశ్మీర్ అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో జమ్మూ కాశ్మీర్ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకొని గ్రూప్ డి స్టాండింగ్స్‌లో ముంబై తర్వాత రెండో స్థానానికి చేరుకుంది.  

ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి జమ్మూ అండ్ కాశ్మీర్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాటింగ్ లో విఫలమైంది. జమ్మూ అండ్ కాశ్మీర్ పేసర్ ఔకిబ్ నబీ 35 పరుగులకు 5 వికెట్లు పడగొట్టడంతో ఢిల్లీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు ఆలౌటైంది. వంశజ్ శర్మ (2/57), అబిద్ ముష్తాక్ (2/30) రాణించారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్మూ అండ్ కాశ్మీర్ 310 పరుగులు చేసింది. కెప్టెన్ పరాస్ డోగ్రా 106 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. అబ్దుల్ సమద్ 85 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడడంతో పాటు.. కన్హయ్య వాధవన్ (47) రాణించాడు. 

►ALSO READ | SA vs IND: తొలి టెస్టుకు ర్యాంక్ టర్నర్ లేదు.. ఈడెన్ గార్డెన్ పిచ్‌పై క్లారిటీ ఇచ్చిన గంగూలీ

తొలి ఇన్నింగ్స్ లో వీరు ముగ్గురు అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా జమ్మూ అండ్ కాశ్మీర్ కు తొలి ఇన్నింగ్స్ లో 99 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఢిల్లీ 277 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఆయుష్ బడోనీ 72, ఆయుష్ దోసేజా 62 పరుగులతో రాణించారు. ఒక దశలో 5 వికెట్ల నష్టానికి 267 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ చివరి ఐదు వికెట్లను 10 పరుగుల తేడాలో కోల్పోయింది. స్పిన్నర్ వంశజ్ శర్మ 68 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి ఢిల్లీ వెన్నువిరిచాడు. 179 పరుగుల స్వల్ప టార్గెట్ ను జమ్మూ అండ్ కాశ్మీర్ మూడు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి గెలిచింది.