
- ముఖ్య అతిథిగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత కోనేరు అశోక్ హాజరు
హైదరాబాద్, వెలుగు: గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో 62వ నేషనల్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ద్రోణాచార్య అవార్డు గ్రహీత కోనేరు అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్ చెస్ చాంపియన్షిప్–62వ వేదికపై నిలబడటం తనకు గర్వకారణంగా ఉందని తెలిపారు. నేడు భారత్ ప్రపంచ చెస్ శక్తిగా ఎదిగిందని చెప్పారు. విశ్వనాథన్ ఆనంద్, హరికృష్ణ, హంపి, హరిదాసన్, ప్రజ్ఞానంద వంటి ప్రతిభావంతులు మన దేశానికి ఎనలేని కీర్తిని తెచ్చారని కొనియాడారు.
అనంతరం విజ్ఞాన్విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ.. భవిష్యత్తులో చెస్ కేవలం మనుషుల మధ్య మాత్రమే కాకుండా ఏఐతో కూడా జరగొచ్చని పేర్కొన్నారు. ఈ కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి స్టూడెంట్లు తమ ఆలోచన శక్తిని పదును పెట్టుకోవాలన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. చెస్ గ్రాండ్ మాస్టర్లకు ఇండియా ఫ్యాక్టరీగా పేరు పొందిందని వివరించారు. వర్సిటీలో 62వ నేషనల్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని వెల్లడించారు.