తైవాన్ను వణికించిన భారీ భూకంపం.. 

తైవాన్ను వణికించిన భారీ భూకంపం.. 

భారీ భూకంపం తైవాన్ ను వణికించింది. యుజింగ్ నగరంలో 7.2 తీవ్రతతో భూమి కంపించింది. యుజింగ్‌కు తూర్పున 85 కిలోమీటర్ల దూరంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:44 గంటలకు భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. తొలుత తీవ్రత 7.2గా ఉందని ప్రకటించిన USGS తర్వాత దాన్ని 6.9కి తగ్గించింది. శనివారం ఇదే ప్రాంతంలో పలుమార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఒకసారి 6.5 తీవ్రతతో కూడా భూకంపం రాగా..  24 గంటల్లోనే మళ్లీ అదే తీవ్రతతో భూమి కంపించినట్లు USGS తెలిపింది. భూకంపం కారణంగా ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగింది. పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. అపార్ట్ మెంట్లు కుప్పకూలిపోయాయి. రాజధాని తైపీలో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి.

భారీ భూకంపం కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. ఒక చోట వంతెన కూలిపోయింది. తైవాన్ రైల్వే శాఖ హువాలియన్, టైటుంగ్ ల మధ్య ట్రైన్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదిలా ఉంటే తైవాన్ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశముందని జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది. తైవాన్ సమీపంలోని మారుమూల దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతవాసులు సముద్రానికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.