
అదొక అందమైన హిల్ స్టేషన్. కొండల నడుమ దారుల్లో వెళ్తుంటే రంగురంగుల పూలు పలకరిస్తాయి. ఎటు చూసినా పచ్చదనంతో మనసు పరవశించిపోతుంది. సుగంధ ద్రవ్యాల సువాసనలు ముక్కుపుటాలను తాకుతుంటే.. రకరకాల సంస్కృతులు కలగలిసిన ఆ నేల మైమరిపిస్తుంది. ఎన్నో రకాల వేషభాషలు తారసపడుతుంటే కొత్త అనుభూతి కలుగుతుంది. ఇవన్నీ చూడాలంటే కలింపాంగ్ వెళ్లాల్సిందే.
డార్జిలింగ్ అనగానే కాఫీ సువాసన గుర్తొస్తుంది. అయితే, ఆ పక్కనే ఉండే కలింపాంగ్ గురించి అయితే చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. పూల పరిమళాల నుంచి పచ్చని పైరు పంటల వరకు... రకరకాల కల్చర్స్, భాషలు, దేవాలయాలు, అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో కట్టిన ఇండ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇక్కడ. ఈ ఊరు చిన్నదే కానీ, జిల్లాగా చాలా పెద్దది. కలింపాంగ్ జిల్లా మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. అటవీ ప్రాంతం, బియ్యం, మొక్కజొన్న, మిల్లెట్స్, సీజన్ వారీగా పండించే కూరగాయలు వంటివన్నీ టెర్రస్ ఫీల్డ్స్‌లో కనిపిస్తాయి. అంతేనా... ఈ ప్రాంతంలో అల్లం, పసుపుతో పాటు యాలకులు వంటి నాణ్యమైన సుగంధ ద్రవ్యాలు దొరుకుతాయి. కలింపాంగ్ మొదట డార్జిలింగ్ జిల్లా పరిధిలో ఉండేది. 2017లో వెస్ట్ బెంగాల్లో వేరొక జిల్లాగా మారింది. అయితే, కలింపాంగ్ ఊరు వరకు చూసుకుంటే విస్తీర్ణంలో చాలా చిన్నది. డార్జిలింగ్, సిలిగురి నుంచి రెండున్నర గంటల జర్నీ. ఆ ఊరు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం టూరిజానికి అనువైన ప్రదేశాలు. కలిం అంటే ‘కింగ్స్ మినిస్టర్’, పోంగ్ అంటే ‘గట్టిగా పట్టుకోవడం’ అని అర్థాలు. ఇది రాజుల కాలం నాటి నుంచి అలవాటైన పేరు కలింపాంగ్. నిజానికి కలింబాంగ్ అనే పదం నుంచి కలింపాంగ్ వచ్చింది. అదొక ఫైబర్ మొక్క. దాన్నుంచి పేపర్ తయారుచేస్తారు. ఈ చెట్లు కలింపాంగ్‌లో విస్తారంగా ఉంటాయి.
అలా చరిత్రలో నిలిచింది
కలింపాంగ్ భూటాన్ రాజుల పాలనలో ఉండేది. ఆ తర్వాత1864, డిసెంబర్ 6న బ్రిటిష్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్లింది. అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్లు అక్కడ పిల్లల కోసం స్కూల్స్ కట్టించి మంచి చదువు చెప్పించారు. ఇప్పటికీ అక్కడ నాణ్యమైన విద్య దొరుకుతుందనే పేరు ఉంది. అందమైన ఇండ్ల ఆర్కిటెక్చర్ కనువిందు చేస్తుంది. బ్రిటిష్ ట్రెడిషనల్ స్టైల్లో కట్టడంతో... వాటిని చూస్తే బ్రిటిష్ కాలం గుర్తొస్తుంది. కలింపాంగ్‌లో లెక్కలేనన్ని చారిటీలు ఉన్నాయి. ఎన్నో రకాల పూల తోటలు చూడొచ్చు. ముఖ్యంగా బ్రిటిష్‌వాళ్లు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయి చాలా కాలమైనా, అప్పటి గుర్తులు మాత్రం ఇప్పటికీ పోలేదు.
అనేక దేశాల సమ్మేళనం
కలింపాంగ్ని 1866లో డార్జిలింగ్ జిల్లాలో ఒక భాగం చేశారు. బ్రిటిష్ వాళ్లు, కలింపాంగ్ని స్వాధీనం చేసుకున్నప్పుడు నేపాలీవాళ్లు చాలామంది బతుకుదెరువు కోసం కలింపాంగ్కి వలస వెళ్లారు. లెప్చా అనే స్థానికులు ఆ ప్రాంతంలో మంచి జీవితాలను పొందారు. మనదేశంవాళ్లు చాలామంది వ్యాపారాలు చేసుకుంటూ అక్కడే సెటిలయ్యారు. నెమ్మదిగా టిబెట్‌తోపాటు కలింపాంగ్ కూడా ట్రేడింగ్ సెంటర్‌కి హబ్‌గా మారింది. మ్యూల్ అనే సంకరజాతి గాడిదలు ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ. వీటిని టిబెట్ పీఠభూమి నుంచి కొనుక్కొస్తారు. అవి రవాణా సౌకర్యానికి ఉపయోగపడతాయి. ఉన్ని తయారీ, మార్కెటింగ్ బాగా జరుగుతుంది.1960ల మధ్యలో టిబెట్‌ని చైనా తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే అప్పటికే కలింపాంగ్‌లో లెప్చా, నేపాలీయులు, బ్రిటిష్, ఇండియన్స్, టిబెటన్, సిక్కులకు సంబంధించిన రకరకాల కల్చర్స్, ట్రెడిషన్స్ మిక్స్ అయిపోయాయి.
ఎప్పుడు వెళ్లొచ్చు?
ప్రస్తుతం కలింపాంగ్ పర్వతాలు, ట్రెక్కింగ్‌కి, పక్షుల్ని చూడడానికి పాపులర్ అయింది. ఇక్కడ స్టే చేయడానికి హెరిటేజ్ హోటల్స్, లాడ్జీలు, టూరిస్ట్ కాంప్లెక్స్‌లు, లగ్జరీ రిసార్ట్స్, బడ్జెట్ హోటల్స్, గెస్ట్ హౌజ్‌లు వంటివి అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ బుకింగ్ సైట్స్‌లో కూడా హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. కలింపాంగ్కి వెళ్లాలంటే మార్చి నుంచి మే నెలల్లో ఎప్పుడైనా వెళ్లొచ్చు. వానాకాలంలో కూడా ఎంతో అందంగా ఉంటుంది కలింపాంగ్.
ఎటు చూసినా పూల సోయగాలే..
కొండల చుట్టూ ఉన్న దారుల్లో వెళ్తుంటే ఎన్నో రకాల పూల తోటలు, ఫెర్న్ మొక్కలు కనిపిస్తాయి. ఈ ఒక్క ప్రాంతంలోనే నాలుగువేల రకాల సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన పూల మొక్కలు, నాలుగు వందల రకాల ఆర్చిడ్స్ ఉన్నాయి. టూరిజంతోపాటు ఇక్కడ ఫ్లోరీ కల్చర్‌కి కూడా మంచి పేరుంది. ఇక్కడ పూల నర్సరీలు చాలా ఎక్కువ. పూలను ఎక్స్పోర్ట్ చేస్తారు. లోకల్ మార్కెట్లలో అమ్ముతారు. సాధారణంగా నర్సరీల్లో పెరిగే వాటిలో కాక్టి, సక్కులెంట్, ఆర్చిడ్ రకాలుంటాయి.
డెలో హిల్స్
కలింపాంగ్కి ఉత్తరాన డెలో హిల్స్ ఉన్నాయి. కలింపాంగ్కి ఉన్న ప్రధాన నీటి వనరు ఇక్కడ ఉన్న రిజర్వాయరే. అక్కడి నుంచే ఊరంతటికీ నీరు అందుతుంది. దక్షిణంలో దర్పిన్ దర కొండలు కనిపిస్తాయి. ఊరికి మధ్యలో మార్కెట్ స్క్వేర్ ఉంటుంది. అక్కడి నుంచి రిషి రోడ్ దారిలో వెళ్తే ఉత్తరం వైపున లెక్కలేనన్ని టిబెటన్ షాపులు కనిపిస్తాయి. అంతేకాదు, రెస్టారెంట్లు, హోటళ్లు, తినుబండారాలు అమ్మే బండ్లు వంటివి బోలెడు కనిపిస్తాయి. ఇక్కడే కలింపాంగ్ టాక్సీ స్టాండ్ ఉంటుంది. టూరిస్ట్‌లు అక్కడ ట్యాక్సీ మాట్లాడుకోవచ్చు.
చూడదగ్గవి
టూరిస్ట్ డెస్టినేషన్స్ వచ్చేసరికి లావా, లోలెగావ్, రిష్యప్, చర్ఖోలె, పెడాంగ్, రిక్కిసమ్ వంటివి చూడొచ్చు. ఒక్క రోజులో ఈ ప్లేసులన్నీ చూసి రావచ్చు. డార్జిలింగ్, మిరిక్, కుర్సెంగ్, గ్యాంగ్‌టక్ వెళ్లొచ్చు. కాంచన్‌జంగ మంచు కొండలు, చారిత్రక బౌద్ధారామాలు, దేవాలయాలు, టూరిస్ట్ కాంప్లెక్స్‌లు, హెరిటేజ్ బిల్డింగ్స్, పార్క్‌లు, పూల నర్సరీలు, హెరిటేజ్ స్కూల్స్, ఛారిటబుల్ ఇనిస్టిట్యూట్స్ చూడొచ్చు. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో జరిగే స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ కూడా బాగుంటాయి.
ఎలా వెళ్లాలంటే...
బాగ్దోగ్రా ఎయిర్ పోర్ట్ నుంచి న్యూ జల్ పై గుడి రైల్వే స్టేషన్ ఉంది. ఇది కలింపాంగ్కి దగ్గర్లో ఉంటుంది. డార్జిలింగ్ నుంచి కలింపాంగ్కి వెళ్లాలంటే కారులో వెళ్లొచ్చు. అదే సిలిగురి నుంచి అయితే తీస్తా బ్రిడ్జ్ మీదుగా వెళ్లొచ్చు.