జైపూర్:రాజస్తాన్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా సీరియస్‌గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఖైర్తల్ తిజారా జిల్లా భివాడి ఏరియాలో ఉన్న కురుక్షేత్ర కరోలిలోని పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది.
ఫ్యాక్టరీలో మంటలు అంటుకున్నట్లు సమాచారం రాగానే ఫైర్ సిబ్బంది స్పాట్‌కు చేరుకున్నారు. రెండుగంటలపాటు శ్రమించి మంటలు అదుపు చేశారు. ఆపై రెస్క్యూ సిబ్బంది ఫ్యాక్టరీలోకి వెళ్లి ఏడుగురి మృతదేహాలను బయటికి తీసుకువచ్చారు. డెడ్‌బాడీలు పూర్తిగా కాలిపోయాయని అధికారులు తెలిపారు.
ప్రాథమిక నివేదిక ప్రకారం ఫ్యాక్టరీలో 20మందికిపైగా ఉన్నారు. మంటలు అంటుకోగానే చాలామంది బయటకు రాగలిగారు. లోపల చిక్కుకుపోయిన 9 మందిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరిని రెస్క్యూ చేసి ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బిహార్‌కు
చెందినవారిగాఅధికారులు గుర్తించారు.
పటాకులే పేలినయా?
ఫ్యాక్టరీలో మంటలు అంటుకునేందుకు ముందు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృందాలు జరిపిన దర్యాప్తులో ఫ్యాక్టరీలో గన్ పౌడర్, పటాకులు, ప్యాకింగ్ బాక్సులు లభ్యమయ్యాయి. పేలిన పటాకుల నమూనాలను సేకరించాయి. అయితే, కెమికల్ ఫ్యాక్టరీ పేరుతో లీజుకు తీసుకుని, అందులో అక్రమంగా పటాకులు తయారు చేస్తున్నారని కలెక్టర్ సుమిత్ర పరీక్ మీడియాకు తెలిపారు.
రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ స్పాట్‌కు చేరుకుని ఫ్యాక్టరీని పరిశీలించారు. భివాడిలోని అన్ని పారిశ్రామిక యూనిట్లలో సేఫ్టీ మెజర్‌మెంట్స్‌పై దర్యాప్తు జరిపి రిపోర్టు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్మికుల మృతికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
