కరోనా మృతుల్లో 70 % మగవాళ్లే

కరోనా మృతుల్లో 70 % మగవాళ్లే

దేశంలో రోజు వారీ కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన ఐదు రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య 9 లక్షల కంటే తక్కువగా ఉందని తెలిపింది. కరోనా వైరస్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ న్యూఢిల్లీలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ కరోనా పాజిటివిటీ రేటు డౌన్ ట్రెండ్‌లో ఉందన్నారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తంగా చేసిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ రేటు 8.07 శాతంగా ఉందని, గడిచిన వారంలో అయితే 6.24%, ప్రస్తుతం డైలీ పాజిటివ్ రేటు 5.16 శాతానికి చేరిందని తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో సుమారు 70 లక్షల పైగా కరోనా కేసులు నమోదు కాగా, అందులో 62 లక్షల మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని రాజేశ్ చెప్పారు. ఐదు రోజులుగా 9 లక్షల లోపు మాత్రమే యాక్టివ్ కేసులు ఉంటున్నాయని, మంగళవారం యాక్టివ్ కేసుల సంఖ్య 8,38,729గా ఉందని అన్నారు.

మృతుల్లో మగవాళ్లే ఎక్కువ

ప్రపంచంలోనే అత్యధిక కరోనా రికవరీలు నమోదైన దేశం ఇండియానేనని రాజేశ్ భూషణ్ చెప్పారు. దేశంలో 87 శాతం కరోనా బాధితులు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 11.69 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. మొత్తం కరోనా కేసుల్లో 1.53 శాతం మంది మాత్రమే మరణించారని, అయితే అందులో ఎక్కువ శాతం మగవాళ్లే ఉన్నారని చెప్పారు. కరోనా మృతుల్లో 70 మగవాళ్లు ఉంటే, 30 శాతం ఆడవాళ్లు ఉన్నారన్నారు. కరోనా మరణాల్లో అత్యధికంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసువాళ్లేనని, ఈ ఏజ్ గ్రూప్‌లో 45 శాతం కరోనా మరణాలు నమోదయ్యాయని రాజేశ్ భూషణ్ చెప్పారు.