
- ప్రాపర్టీ నంబర్లు కూడా తీసుకోలే
- అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, అవినీతే కారణం
- బల్దియాకు భారీగా నష్టం
- నోటీసులు ఇవ్వడంతో పాటు పెనాల్టీలు
- దాదాపు రూ.500 కోట్ల వస్తాయని అంచనా
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో 70 వేల భవనాలు అసలు ట్యాక్స్ చెల్లించకుండా ఉన్నట్లు జీహెచ్ఎంసీ తేల్చింది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే ఈ భవనాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ రావడంలేన్నట్లు ఇటీవల నిర్వహించిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే( జీఐఎస్)లో తేలింది. ఏండ్ల కింద నిర్మించి వినియోగంలో ఉన్న భవనాల నుంచి ఆస్తి పన్నులు ఎందుకు చెల్లించడంలేదన్న దానిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
ముందుగా భవన యజమానులకు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఎప్పుడు నిర్మించారనే దాంతో పాటు అనుమతులు తీసుకున్నారా? లేదా అన్న దానిపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ భవనాల నుంచి జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం అనుమతులు ఉంటే మూడేండ్ల పన్నులు వసూల్ చేయడంతోపాటు అక్రమ నిర్మాణాలైతే వంద శాతం పెనాల్టీతో రెండింతల పన్నులు వసూలు చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇందుకు బాధ్యతులుగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.
జీఐఎస్ బయటపడ్డ బాగోతం
జీఐఎస్(జియో ఇన్ఫర్ మేషన్ సిస్టం) తో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది బాగోతం బయడపడుతోంది. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, ట్రేడ్ లైసెన్స్ ల విషయంలో ఇన్నాళ్లు వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. గ్రేటర్ లో ఉన్నతాధికారులకు తెలియకుండా సర్కిల్ స్థాయిలోనే ప్రాపర్టీ ట్యాక్స్ లు, ట్రేడ్ లైసెన్స్ ల సెటిల్ మెంట్ల దందాను యథేచ్చగా కొనసాగించారు.
కొంతమంది అధికారులు, సిబ్బంది వారి స్వలాభం కోసం కోట్లలో వచ్చే ఆదాయాన్ని గండికొట్టారు. ఇలా ఏండ్లుగా చూస్తే కోట్లలో బల్దియా నష్టపోయింది. గ్రేటర్ లో 19.50 లక్షల ప్రపార్టీల నుంచి జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను కలెక్ట్ చేస్తుంది. ఇందులో రెండు లక్షల కమర్షియల్ భవనాలు ఉన్నాయి. ఇటువంటి వారిని గుర్తించేందుకు జీహెచ్ఎంసీ కరెంట్ మీటర్ల ఆధారంగా తనిఖీలు నిర్వహించింది.
ఈ తనిఖీలో దాదాపను 93 వేల భవనాలకు కమర్షియల్ కరెంట్ మీటర్లను వినియోగిస్తూ, జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు గుర్తించారు. వీరి నుంచి కూడా కమర్షియల్ ట్యాక్స్ కలెక్ట్ చేయనున్నారు. విద్యుత్ మీటర్లు ఎప్పుడు తీసుకున్నారో అప్పటి నుంచి కమర్షియల్ ట్యాక్స్ వసూల్ చేసేందుకు రంగం సిద్ధమైంది.
రూ.500 కోట్లు వస్తుందని అంచనా
కమర్షియల్ కరెంటు మీటర్లను వినియోగిస్తూ జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్న 93 వేల ఆస్తులతో పాటు అసలు ట్యాక్స్ పరిధిలోకి రాని 70 వేల భవనాల నుంచి పకడ్బందీగా పన్ను వసూలు చేసేందుకు బల్దియా ఉన్నతాధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
ఓ పక్కన జీహెచ్ఎంసీ ఆదాయనికి నష్టం కలిగించిన వారిపై చర్యలు తీసుంటూనే మరో పక్కన కలెక్షన్ చేయనున్నారు. ఇలా వీరి నుంచి దాదాపు రూ.500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో ఇందుకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిసింది.