70 షాప్లు మహిళలకే.. ఉమ్మడి మెదక్జిల్లా వ్యాప్తంగా వైన్స్ షాప్ లైసెన్స్ ప్రక్రియ పూర్తి

70 షాప్లు మహిళలకే.. ఉమ్మడి మెదక్జిల్లా వ్యాప్తంగా వైన్స్ షాప్ లైసెన్స్ ప్రక్రియ పూర్తి

మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 70 మంది మహిళలకు కలిసి వచ్చింది. 2025–27 సంవత్సరాలకు సంబంధించిన వైన్స్ షాప్ లైసెన్స్ ల కేటాయింపు కోసం సోమవారం లాటరీ తీశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 243 వైన్స్ షాప్ లు ఉండగా, సంగారెడ్డి జిల్లాలో ఒక షాప్ లైసెన్స్ పెండింగ్ లో పెట్టగా, మిగిలిన 242 షాప్ లకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా తీశారు. ఇందులో 70 షాప్ ల లైసెన్స్ లు మహిళలకు దక్కాయి. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో 101  వైన్స్ షాపులకు మొత్తం 4,432 దరఖాస్తులు అందాయి. కలెక్టర్ ప్రావీణ్య సమక్షంలో సంగారెడ్డి  జెఎస్ఆర్ గార్డెన్​లో లక్కీ డ్రా నిర్వహించారు. 100 షాపులకు కేటాయింపులు పూర్తి చేయగా మిగిలిన ఒక దుకాణానికి ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రీ -నోటిఫికేషన్ చేయనున్నారు. 100 షాపుల్లో 68 దుకాణాలు పురుషులు దక్కించుకోగా, 32 షాపులను మహిళలు సొంతం చేసుకున్నారు. తక్కువ దరఖాస్తులు అందిన నేపథ్యంలో మునిపల్లి మండలం తాటిపల్లిలోని 24వ నెంబరు వైన్ షాపు కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఎక్సైజ్ నిబంధన ప్రకారం ప్రతి షాప్ కు 20 దరఖాస్తులు అందాల్సి ఉండగా ఈ షాప్ న కు 19 దరఖాస్తులు రావడంతో టెండర్ నిలిపివేసి డిసెంబర్ 1 లోగా రీ షెడ్యూల్ చేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. గతంలో ఈ షాపునకు 40 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్, సూపరింటెండెంట్ నవీన్ చంద్ర పాల్గొన్నారు.

మెదక్ జిల్లాలో..

జిల్లాలో 49 వైన్స్ షాప్ లు ఉండగా మొత్తం 1,402  దరఖాస్తులు దాఖలయ్యాయి. కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర గార్డెన్ లో లాటరీ నిర్వహించారు. షాప్ ల వారీగా డ్రా తీశారు. మొత్తం 49 వైన్స్ లలో 18 షాప్ ల  లైసెన్స్ లు  మహిళలకు దక్కాయి. మెదక్ పట్టణంలో షాప్ నెంబర్ 2 అర్చనకు, పెద్దశంకరంపేటలోని షాప్ నెంబర్ 2 హిమబిందు, షాప్ నెంబర్ 3 ఉమారాణి, టేక్మాల్ షాప్ లక్ష్మీ, కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి షాప్ నెంబర్ 1 లావణ్య, తూప్రాన్ షాప్ నెంబర్ 3 మాధురి, నర్సాపూర్ షాప్ నెంబర్ 1యశోద, షాప్ నెంబర్ 3 కృష్ణవేణి, షాప్ నెంబర్ 4 సరిత, మనోహరాబాద్ మండలం కాళ్లకల్ షాప్ నెంబర్ 2 సింధు, కౌడిపల్లి షాప్ నెంబర్ 2 లక్ష్మీ, శివ్వంపేట మండలం దొంతి షాప్ సంధ్యారాణి, మనోహరాబాద్ జ్యోత్స్న, చేగుంట షాప్ నెంబర్ 1 మాధవి, వడ్యారం షాప్ మీన, మాసాయిపేట షాప్ శిరీష, నిజాంపేట షాప్ అనసూయ, చిన్నశంకరంపేట షాప్ సంధ్యారాణి దక్కించుకున్నారు. లాటరీలో వైన్స్ లైసెన్స్ దక్కించుకున్న వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి షాప్ లు నిర్వహించాల్సి ఉంటుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలో 93 వైన్స్ లకు మొత్తం 2,782  అప్లికేషన్లు దాఖలు చేశారు. సిద్దిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 805, గజ్వేల్ 810, హుస్నాబాద్ 508, చేర్యాల 416, మిరుదొడ్డి 243 చొప్పున అప్లికేషన్లు దాఖలయ్యాయి. జిల్లా కేంద్రంలోని సీసీ గార్డెన్ లో  కలెక్టర్  హైమావతి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. దరఖాస్తులు చేసుకున్న అశావహులు జిల్లా కేంద్రంలోని సీసీ గార్డెన్ కు భారీగా తరలివచ్చారు. మొత్తం 93 షాప్ లలో 20 షాప్ ల లైసెన్స్ లు మహిళలకు దక్కాయి. దుకాణాలు దక్కిన వారు సంతోషం వ్యక్తం చేయగా దక్కని వారు నిరాశతో 
వెనుదిరిగారు.