ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

న్యూఢిల్లీ: జర్మనీకి వెళ్లాల్సిన రెండు విమానాలు రద్దు కావడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 700 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. సడెన్ గా ఫ్లైట్లను రద్దు చేయడంతో ప్రయాణికులంతా ఆందోళనకు దిగారు. గురువారం అర్ధరాత్రి దాటినంక దాదాపు 100 మంది ఎయిర్ పోర్టు గేటు ముందు బైఠాయించారు. తమను వేరే విమానాల్లో పంపించాలని, లేదంటే టికెట్ చార్జీలు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్టులో చిక్కుకున్న తమకు కనీస సౌలతులు కల్పించలేదని మండిపడ్డారు. వీరిలో ఎక్కువ మంది స్టూడెంట్లే ఉన్నారు. తమకు త్వరలో కాలేజీలు ప్రారంభమవుతాయని, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు.

పోలీసులు వచ్చి వాళ్లను సముదాయించి, ఆందోళన విరమింపజేశారు. గురువారం అర్ధరాత్రి దాటినంక 300 మందితో ఫ్రాంక్ ఫర్ట్ కు, 400 మందితో మ్యూనిచ్ కు రెండు విమానాలు వెళ్లాల్సి ఉంది. అయితే జీతాలు పెంచాలని పైలెట్లు ఒక్క రోజు సమ్మెకు దిగడంతో, శుక్రవారం వెళ్లాల్సిన విమానాలన్నింటినీ జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ రద్దుచేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం 800 విమానాలను రద్దు చేయగా.. లక్షా 30 వేల మందిపై ప్రభావం పడింది.