
లండన్: హ్యాకర్ల దెబ్బకు యూకేలో 158 ఏండ్లుగా వ్యాపారం చేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ మూతపడింది. దీంతో అందులో పనిచేస్తున్న 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు. యూకేలోని కేఎన్‌పీ కంపెనీ ట్రాన్స్‌పోర్ట్ రంగంలో 158 ఏండ్లుగా వ్యాపారం చేస్తోంది. నైట్స్ ఆఫ్ ఓల్డ్ బ్రాండ్ పేరిట ఈ కంపెనీ 500 లారీలను నిర్వహిస్తోంది. వీటన్నింటినీ మానిటర్ చేసేందుకు 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఐటీ ప్రమాణాలు, ఇండస్ట్రీ రూల్స్ పాటించే మంచి కంపెనీగా కేఎన్‌పీకి పేరుంది. కంపెనీకి సైబర్ అటాక్స్ బీమా కూడా ఉంది. అయినప్పటికీ ఈ సంస్థ సైబర్ దాడికి గురైంది. అకిరా గ్యాంగ్ హ్యాకర్ల రాన్సమ్‌వేర్ సైబర్ అటాక్‌కు గురైంది. హ్యాకర్లు కంపెనీ సాఫ్ట్‌వేర్‌లోకి చొరబడి డేటా మొత్తం ఎన్‌క్రిప్ట్ చేశారు. దీంతో ఉద్యోగులు లాగిన్ కాలేకపోయారు. తిరిగి డేటాను పొందాలంటే రూ.60 కోట్లు చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేమని మేనేజ్‌మెంట్ చెప్పడంతో హ్యాకర్లు డేటా మొత్తాన్ని మాయం చేశారు. దీంతో కంపెనీ పతనానికి దారితీసింది. తమ కంపెనీ ఉద్యోగుల పాస్‌వర్డ్ వీక్‌గా ఉండటంతో హ్యాకర్లు పసిగట్టగలిగారని కేఎన్‌పీ డైరెక్టర్ పాల్ అబాట్ తెలిపారు.