ధొలేరా: టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లు క్రమంగా అన్ని రంగాలకు చిప్‌లను సరఫరా చేయడం ద్వారా దశలవారీగా సేవలందిస్తాయని, కొన్ని సంవత్సరాల్లో దాదాపు 72వేల ఉద్యోగాలను సృష్టిస్తాయని టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. టాటా ఎలక్ట్రానిక్స్ అస్సాంలో రూ. 91వేల కోట్ల పెట్టుబడితో చిప్ తయారీ ప్లాంట్, రూ. 27వేల కోట్లతో చేపట్టిన చిప్ అసెంబ్లీ సౌకర్యాల శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రశేఖరన్ మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పారు.
ఆటోమోటివ్, పవర్, ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ మెడికల్ వంటి వివిధ రంగాల అవసరాలను టాటా ఎలక్ట్రానిక్స్ చిప్స్ తీర్చగలవని ఆయన చెప్పారు. టాటా చిప్ ప్లాంట్ 28 నానోమీటర్ల (ఎన్ఎం) నుంచి 110 నానోమీటర్ల వరకు చిప్స్‌ను ఉత్పత్తి చేయగలదని ఛైర్మన్ పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు మొదలైన హై-టెక్ గాడ్జెట్‌లకు ప్రధానంగా 3 ఎన్ఎం, 7 ఎన్ఎం 14 ఎన్ఎం వంటి చిన్న నోడ్‌ల చిప్‌లు అవసరం. 2026 క్యాలెండర్ సంవత్సరంలోపు చిప్‌లను ఉత్పత్తి చేయడం తమ టార్గెట్ అని చంద్రశేఖరన్ వెల్లడించారు.
