జనగణమన.. గ్రేటర్ వ్యాప్తంగా.. సంబురంగా 75వ రిపబ్లిక్ డే వేడుకలు

జనగణమన.. గ్రేటర్ వ్యాప్తంగా.. సంబురంగా 75వ రిపబ్లిక్ డే వేడుకలు

హైదరాబాద్/ముషీరాబాద్/సికింద్రాబాద్/ ఖైరతాబాద్/జీడిమెట్ల/జేఎన్టీయూ/ చేవెళ్ల, వెలుగు: గ్రేటర్ వ్యాప్తంగా శుక్రవారం 75వ రిపబ్లిక్ డే వేడుకలు సంబురంగా జరిగాయి. బల్దియా హెడ్డాఫీసులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డితో కలిసి కమిషనర్ రోనాల్డ్ రాస్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఉత్తమ సేవలు అందించిన 43 మంది బల్దియా అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. హెచ్ఎండీఏ హెడ్డాఫీసులో జరిగిన కమిషనర్ దానకిశోర్ జాతీయ జెండాను ఎగురవేశారు. జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి పాల్గొన్నారు. ఖైరతాబాద్ లోని వాటర్​బోర్డు హెడ్డాఫీసులో ఎండీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. లక్డీ కపూల్​లోని డీజీపీ ఆఫీసులో అడిషనల్ డీజీ మహేష్​ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఏసీబీ హెడ్ క్వార్టర్స్​లో అడిషనల్ డీజీ సీవీ ఆనంద్,  జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పరేడ్ గ్రౌండ్స్​లో, బంజారాహిల్స్​లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్​లో అడ్మిన్ జాయింట్ సీపీ పరిమళ నూతన్, సైబరాబాద్ కమిషనరేట్​లో సీపీ అవినాష్​ మహంతి, రాచకొండలో సీపీ సుధీర్ బాబు, కొండాపూర్ లోని 8వ బెటాలియన్​లో కమాండెంట్ సన్నీ జాతీయ జెండా ఎగురవేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి పోలీస్ ఉన్నతాధికారులు పతకాలు అందించారు. కూకట్ పల్లిలోని జేఎన్టీయూలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించగా.. వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో 25 మీటర్ల ఎత్తులో కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ జెండాను  వీసీ రవీందర్ ఎగురవేశారు. సికింద్రాబాద్ లోని ఆర్ఆర్ సీ గ్రౌండ్​లో సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. జీఎం అరుణ్​కుమార్ జైన్ హాజరై ఆర్పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ ​విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ టీసీసీఐ)లో ప్రెసిడెంట్ మీలా జయదేవ్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.  న్యూ బోయిగూడలోని రాష్ట్ర ముదిరాజ్ భవన్​లో, రాజేంద్రనగర్​లోని అగ్రివర్సిటీలో, సోమాజిగూడ్​ ప్రెస్​క్లబ్​లో, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్​పల్లిలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్​లో..

హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్​లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జాతీయ జెండా ఎగురవేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోకు కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.

 రంగారెడ్డి కలెక్టరేట్​లో..

ఎల్​బీనగర్ : కొంగరకలాన్​లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ శశాంక జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, మహేశ్వరం డీసీపీ సునీత పాల్గొన్నారు.

మేడ్చల్ కలెక్టరేట్​లో..

శామీర్​పేట : అంతాయిపల్లిలోని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్​లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ గౌతమ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ట్రాన్స్ పోర్టు డిపార్ట్​మెంట్​లో ఉత్తమ సేవలు అందించినందుకుగాను మేడ్చల్ డీటీవో కిషన్ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

వికారాబాద్ కలెక్టరేట్ లో..

వికారాబాద్ :  వికారాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ నారాయణ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన కృషిని మరువలేమని కలెక్టర్ తెలిపారు.