హుజూర్​నగర్​లో 76 మంది నామినేషన్​

హుజూర్​నగర్​లో 76 మంది నామినేషన్​
  • వివిధ పార్టీలు, ఇండిపెండెంట్లు, సంఘాల నుంచి 119 సెట్లు దాఖలు
  • సర్పంచుల నామినేషన్లపై కొర్రీలు
  • సర్పంచుల ఫోరం ఆందోళన
  • ఆఖరులో వెనక్కి తగ్గిన లాయర్లు
  • నామినేషన్లు వేయకుండా  టీఆర్ఎస్కు మద్దతు ప్రకటన

సూర్యాపేట/ హుజూర్ నగర్, వెలుగుహుజూర్​నగర్​ ఉప ఎన్నికల కోసం 76 మంది క్యాండిడేట్ల నుంచి 119 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం ఆఖరి తేదీకావడంతో వివిధ పార్టీల అభ్యర్థులతోపాటు సర్పంచులు, వికలాంగులు, గిరిజన సంఘాల వారు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. పార్టీల నేతలు, క్యాండిడేట్లు, మద్దతుదారులు రావడంతో సోమవారం హుజూర్​నగర్​ పట్టణం కిటకిటలాడింది. నామినేషన్​ వేసిన అధికార టీఆర్ఎస్​ క్యాండిడేట్​ సైదిరెడ్డి వెంట మంత్రి జగదీశ్​రెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య, చిరుమర్తి లింగయ్య, భాస్కర్ రావు, గొంగిడి సునీత వచ్చారు. కాంగ్రెస్  క్యాండిడేట్  పద్మావతిరెడ్డి వెంట స్థానిక నాయకులు తరలివచ్చారు. బీజేపీ క్యాండిడేట్​ కోట రామారావు వెంట రాష్ట్ర చీఫ్​లక్ష్మణ్, ఎంపీ గరికపాటి, పేరాల చంద్రశేఖర్ తదితర నేతలు ఉన్నారు. టీడీపీ క్యాండిడేట్​ కిరణ్మయి వెంట పార్టీ రాష్ట్ర చీఫ్​ ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి మరికొందరు నేతలు వచ్చారు.

ఒక్కరోజే వందకుపైగా..

హుజూర్​నగర్​ ఉప ఎన్నిక కోసం సెప్టెంబర్ 23 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకాగా.. ఆదివారం వరకు 9 మంది అభ్యర్థులు 13 సెట్లు సమర్పించారు. మిగతావన్నీ సోమవారం వచ్చినవే. మొత్తంగా 76 మంది క్యాండిడేట్లు 119 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. రాత్రి 7 గంటల సమయం వరకు నామినేషన్  స్వీకరణ కేంద్రాలకు వచ్చిన క్యాండిడేట్ల నుంచి పేపర్లు స్వీకరించారు. చివరగా సర్పంచుల నుంచి నామినేషన్​ పేపర్లు తీసుకునే సమయంలో అధికారులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో సర్పంచులు ఆందోళనకు దిగారు. సీపీఎం క్యాండిడేట్​గా పారుపల్లి శేఖర్ రావు, బీఎల్ఎఫ్  నుంచి మేడి రమణ, తెలంగాణ ప్రజల పార్టీ నుంచి దేశగాని సాంబశివగౌడ్, గిరిజన సంఘాల నుంచి కృష్ణా నాయక్, తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక కన్వీనర్ మేకల రఘుమారెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్​ వేశారు.

నామినేషన్లపై వెనక్కి తగ్గిన లాయర్లు

తమ సమస్యల పరిష్కారం కోసం నామినేషన్లు వేసి నిరసన చెబుతామన్న లాయర్లు చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. అప్లికేషన్​ పేపర్లు కూడా తీసుకున్న లాయర్లు.. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, నామినేషన్లు వేయడం లేదని ప్రకటించారు.
తమపట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున టీఆర్ఎస్  క్యాండిడేట్  సైదిరెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నామని హుజూర్ నగర్  బార్  అసోసియేషన్  సభ్యులు తెలిపారు.

అన్నీ ఇన్నోవాలు.. ఫార్చునర్లే..

నామినేషన్ల చివరిరోజు టీఆర్ఎస్, ఇతర ప్రధాన పార్టీల క్యాండిడేట్లకు మద్దతుగా వచ్చిన నేతలతో హుజూర్ నగర్ కిక్కిరిసి పోయింది. రోడ్ల మీద ఎక్కడ చూసినా ఫార్చునర్లు, ఇన్నోవాలు ఇతర పెద్ద కార్లే కనిపించాయి.

వికలాంగులను పట్టించుకోవట్లే: గిద్దె  రాజేశ్​

ప్రభుత్వం, పార్టీలు వికలాంగులను పట్టించుకోవడం లేదని అఖిల భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్​ అన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నామినేషన్​ వేశామన్నారు. వికలాంగుల శాఖను మహిళా శిశుసంక్షేమ శాఖ నుంచి వేరు చేయాలన్నారు.