90 నిమిషాల్లో 21 సార్లు ప్రకంపనలు..జపాన్​లో భారీ భూకంపం

90 నిమిషాల్లో 21 సార్లు ప్రకంపనలు..జపాన్​లో భారీ భూకంపం
  • రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదు
  • ఇషికావా, నైగటా, టయోమా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం
  • సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
  • దెబ్బతిన్న రోడ్లు.. కూలిన చెట్లు..మూడు రాష్ట్రాల్లో కరెంట్ కట్​

టోక్యో : భారీ భూకంపానికి జపాన్ వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. సోమవారం సాయంత్రం 90‌‌‌‌ నిమిషాల్లో 21 సార్లు భూమి కంపించింది. ప్రతి సారీ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత కనీసం 4.0 పైనే నమోదైందని జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది. జపాన్​లోని ఇషికావా, నైగటా, టయోమా, నోటో రాష్ట్రాల్లో భూమి కంపించింది. మొదట 5.7 తీవ్రతతో భూ ప్రకంపనలు మొదలయ్యాయని, ఒక దశలో తీవ్రత రిక్టర్‌‌ స్కేల్‌‌పై 7.6గా నమోదైందని వివరించింది. తీవ్ర స్థాయిలో భూమి కంపించడంతో ఇండ్లు, ఆఫీసుల్లోని జనాలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో ముందుగా భూమి కంపించింది. తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో అక్కడి రవాణావ్యవస్థ స్తంభించిపోయింది. రోడ్లు, రైల్వే ట్రాక్​లకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీనికితోడు చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయిందని అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే సునామీ హెచ్చరికలను జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు ఎత్తయిన ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.

తీర ప్రాంతాలకు సునామీ ముప్పు

జపాన్ పశ్చిమ తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వరుస భూకంపాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. జపాన్‌‌ తీరం వెంబడి భూకంప కేంద్రానికి 300 కి.మీ పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే చాన్స్ ఉందని హవాయికి చెందిన సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. హోక్కాయిడో నుంచి నాగసాకి దాకా సునామీ ముప్పు ఉన్నట్లు తెలిపింది. తీర ప్రాంతం నుంచి దూరంగా.. ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. ఇషికావాలోని వాజిమా పోర్టులో దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో అలలను గుర్తించారు. అదేవిధంగా, హోన్షు పశ్చిమ తీరం వెంట కూడా సునామీ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. తీర ప్రాంతాన్ని ఐదు మీటర్ల ఎత్తు వరకు అలలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వివరించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. నైగటా, ఇషికావా స్టేట్స్​లోని తీర ప్రాంతాలను 10 అడుగుల ఎత్తైన అలలు ముంచెత్తే అవకాశాలున్నట్లు తెలిపారు. జపాన్​లో సంభవించిన భారీ భూకంపంతో ఉత్తర కొరియా, రష్యా అలర్ట్ అయ్యాయి. ఈ రెండు దేశాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

2011లో 18,500 మంది మృతి

2011, మార్చిలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 9గా నమోదైంది. అప్పుడు సునామీ రావడంతో 18,500 మందికిపైగా చనిపోయారు. ఫుకుషిమాలోని న్యూక్లియర్ ప్లాంట్ కూడా దెబ్బతిన్నది. మూడు రియాక్టర్లు ధ్వంసం అయ్యాయి. చెర్నోబిల్ తర్వాత అత్యంత తీవ్రమైన న్యూక్లియర్ ప్రమాదంగా ఇది నిలిచింది. తర్వాత.. 2022, మార్చిలో ఫుకుషిమా తీరంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈస్ట్ జపాన్​లోని చాలా సిటీలు దెబ్బతిన్నాయి. ముగ్గురు చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. పోయిన ఏడాది మేలో కూడా 6.5 తీవ్రతతో భూమి కంపించింది. అప్పుడు 13 మంది గాయపడగా.. ఒకరు చనిపోయారు. ఆ టైమ్​లో కూడా భూకంప కేంద్ర ఇషికావా ప్రాంతంలోనే ఉంది. సరిగ్గా వందేండ్ల కింద 1923లో సంభవించిన భారీ భూకంపంతో జపాన్ రాజధాని టోక్యో చాలా వరకు దెబ్బతిన్నది. జపాన్​లో ప్రతి ఏడాదీ సగటున 5వేల వరకు చిన్న.. పెద్ద భూకంపాలు సంభవిస్తుంటాయి.

వాజిమా సిటీలో చెలరేగిన మంటలు

భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలా వరకు భవనాలు ధ్వంసం అయ్యాయి. కొన్ని చోట్ల మంటలు చెలరేగాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భూకంప తీవ్రతకు ఇషికావా రాష్ట్రంలోని వాజిమా నగరం ఘోరంగా దెబ్బతిన్నది. వాజిమా సిటీలోని రెసిడెన్షియల్ ఏరియాలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అండర్ గ్రౌండ్ వాటర్ పైపులు పగిలిపోవడంతో దగ్గర్లోని రైల్వే స్టేషన్​ను వరద ముంచెత్తింది. ఇషికావా స్టేట్​లో చాలా చోట్ల ఇండ్లు కూలినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు వివరించారు. సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నది. అయితే.. మృతులు, గాయపడిన వాళ్ల సంఖ్యను మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు. షిఖా టౌన్ లోని ఇళ్లు, కార్లు ధ్వంసం అయ్యాయి. వాజిమా సిటీలోని రోడ్లకు పగుళ్లు వచ్చాయి. 

న్యూక్లియర్ ప్లాంట్లు సేఫ్

భూకంప తీవ్రతకు ఇషికావా ప్రిఫెక్చర్‌‌.. కనజావాలోని ఒనోహియోషి ఆలయం దెబ్బతిన్నది. రాతి స్తంభాలు కూలిపోయాయి. సోమవారం సాయంత్రం 4.10 గంటలకు సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా రికార్డయింది. తర్వాత వరుసగా.. 4.18 గంటలకు 6.1 తీవ్రత, 4.23 గంటలకు 4.5 తీవ్రత, 4.29 గంటలకు 4.60 తీవ్రత, 4.32 గంటలకు 4.80 తీవ్రతతో భూమి కంపించిం ది. న్యూక్లియర్ ప్లాంట్లకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. అయితే, రానున్న 2, 3 రోజుల్లో భారీ భూకంపం సంభ వించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు జపాన్ ప్రభుత్వం స్పెషల్ ఎమర్జెన్సీ సెంటర్​ను ఏర్పాటు చేసింది. దెబ్బతిన్న ఏరియాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాని పుమియో కిషిడా ఆదేశాలు జారీ చేశా రు. జపాన్‌‌లోని ఇండియన్ ఎంబసీ అధికారు లు స్పందించారు. ఆఫీస్​లో కంట్రోల్‌‌ రూం ఏర్పాటు చేశారు. సహాయం కోసం ఫోన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు.

బుల్లెట్ ట్రైన్ సేవలు రద్దు

భూకంప కేంద్రం చుట్టూ ఉన్న టయోమా, ఇషికావా, నైగటా రాష్ట్రాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దాదాపు 33,500 కుటుంబాలు చీకట్లో ఉన్నాయి. మూడు రాష్ట్రాల చుట్టూ ఉన్న మేజర్ హైవేలను అధికారులు మూసేశారు. అండర్ గ్రౌండ్ రైల్వే సేవలు ఆపేశారు. టోక్యో, భూకంప ప్రభావిత రాష్ట్రాల మధ్య బుల్లెట్ ట్రైన్ సేవలు కూడా నిలిపేశారు. ఇంకా భూకంపం ముప్పు పొంచి ఉండటంతో వేలాది మంది ప్రజలు రోడ్లపైనే గడుపుతున్నారు. కొంత మంది అవసరమైన వస్తువులు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.