
ఆసిఫాబాద్, వెలుగు: మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా కేసులో10 మందిపై కేసు నమోదు చేసి, 8 మందిని అరెస్ట్చేసినట్లు తెలిపారు. ఆసిఫాబాద్ మండలం వాదిగొందికి చెందిన యువతి మిస్సింగ్ కేసు దర్యాప్తు లో భాగంగా ఈ విషయం వెలుగు చూసిందన్నారు. ఆమెను మోసగించి, తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా చూపి, రూ.1.30 లక్షలకు మధ్యప్రదేశ్ కు చెందినవారికి అమ్మేసినట్లు చెప్పారు. బాధితురాలిని బలవంతంగా తప్పుదారిలోకి నెట్టారని పేర్కొన్నారు.
తనను కూడా మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తులకు రూ.1.10 లక్షలకు అమ్మేశారని మరో యువతి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.ఈ రెండు కేసుల్లో10 మందిని నిందితులుగా గుర్తించామని, వారిలో 8 మందిని శుక్రవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించామని పేర్కొన్నారు. ఇద్దరు బశేర్ రమేశ్ గౌడ్, సోనీ జగదీశ్పరారీలో ఉన్నారని, వారి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. 2019 లో తిర్యాణిలో మానవ అక్రమ రవాణా కేసులో నిందితులుగా ఉన్న బశేర్ రమేశ్ గౌడ్, బశేర్ సురేఖ ఈ కేసులోనూ ఉన్నారని చెప్పారు.