- మృతులంతా ఒకే కుటుంబం
- పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం
లూసియానా: అమెరికాలోని లూసియానా రాష్ట్రం శ్రీవ్‌పోర్ట్ సిటీలో ఆదివారం ఓ వ్యక్తి మారణహోమం సృష్టించాడు. ఉదయం 6 గంటలకు వరుసగా మూడు ఇండ్లలోకి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది చిన్నారులు మరణించారు. వారంతా 1 నుంచి 14 ఏండ్ల వయసులోపు వారేనని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు మహిళలకు బుల్లెట్ గాయాలు కాగా ఆసుపత్రికి తరలించామని వివరించారు.
ప్రస్తుతం వారి పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పారు. కాల్పుల అనంతరం నిందితుడు ఒక కారును దొంగిలించి అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని వెంబడించారు. ఆ సమయంలో నిందితుడు పోలీసుల పైకి కాల్పులు జరపగా.. వారు జరిపిన ఎదురు కాల్పుల్లో అతను మృతిచెందాడు.
మృతులకు నిందితుడు బంధువేనని, ఇది కుటుంబ కలహాల వల్ల జరిగిన దారుణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తన సుదీర్ఘ పోలీస్ కెరీర్‌లో ఇంతటి భయంకరమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదని శ్రీవ్‌పోర్ట్ పోలీస్ చీఫ్ వేన్ స్మిత్ ఆవేదన వ్యక్తం చేశారు. లూసియానా స్టేట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

