బిహార్​లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం

బిహార్​లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
  • ట్రాక్టర్​ను జీపు ఢీ కొట్టడంతో ఘటన 

ఖగారియా : బిహార్​లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్– జీపు ఢీ కొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సోమవారం వేకువజామున ఖగారియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొంత మంది ఓ పెళ్లికి వెళ్లి జీపులో తిరిగి వస్తున్నారు. పస్రాహా ప్రాంతంలోని 31వ నంబర్ జాతీయ రహదారిపై చేరుకోగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను జీపు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారికి చికిత్సను అందించేందుకు భాగల్పూర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పారు.

పాక్ లో పైకప్పు కూలి ఆరుగురి మృతి

పెషావర్: పాక్ లోని ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.  మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. దక్షిణ వజీరిస్తాన్ లోని రగ్జాయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.