వర్సిటీలో కాల్పులు జరిపింది వీడే!

వర్సిటీలో కాల్పులు జరిపింది వీడే!

రష్యాలోని పెర్మ్‌ స్టేట్ యూనివర్సిటీలో ఈ రోజు (సోమవారం) ఉదయం ఓ దుండగుడు ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరిపి ఎనిమిది మందిని పొట్టనబెట్టుకున్నాడు. నల్లటి డ్రస్, హెల్మెట్ పెట్టుకుని పెద్ద తుపాకీతో యూనివర్సిటీలోకి ఎంటరయ్యాడు ఆ దుర్మార్గుడు. క్యాంపస్‌ లోపలికి వస్తున్నప్పుడు వర్సిటీ బిల్డింగ్‌ పైనున్న స్టూడెంట్స్ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆ యూనివర్సిటీ స్టూడెంటే

రష్యాలోని పెర్మ్‌ కరై రీజియన్‌లోని పెర్మ్‌ స్టేట్ యూనివర్సిటీలోకి ఉదయం 11 గంటల సమయంలో దుండగుడు తుపాకీతో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి కండిషన్ సీరియస్‌గా ఉంది. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు కొందరు స్టూడెంట్స్ బిల్డింగ్‌పై నుంచి దూకి గాయాలపాలయ్యారు. దీని గురించి సమాచారం అందుకున్న  రష్యా పోలీసులు వర్సిటీకి వెళ్లడి ఆ దుండగుడిని మట్టుబెట్టారు. అయితే ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్‌లో ఆ కాల్పులకు పాల్పడిన వ్యక్తి అదే యూనివర్సిటీలో చదువుతున్న 18 ఏండ్ల స్టూడెంట్ అని తేలింది.

ఇండియన్ ఎంబసీ స్టేట్‌మెంట్

పెర్మ్‌ స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల ఘటనను ఖండిస్తూ రష్యాలోని ఇండియన్ ఎంబసీ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. వర్సిటీలో అటాక్‌పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతి తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంది.  పెర్మ్‌ అధికారులతో ఎంబసీ టచ్‌లో ఉందని, ఇండియన్ స్టూడెంట్స్ అంతా సేఫ్‌గా ఉన్నారని, ఈ దాడిలో ఎవరికీ ఏం కాలేదని ఎంబసీ స్పష్టం చేసింది.