దుర్గా నిమజ్జనం చేస్తుండగా పోటెత్తిన వరద.. 8 మంది మృతి

దుర్గా నిమజ్జనం చేస్తుండగా పోటెత్తిన వరద.. 8 మంది మృతి

దుర్గా మాత నిమజ్జనోత్సవ వేళ అపశృతి చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లా పరిధిలో ఉన్న  మాల్ నదిలో వందలాది మంది భక్తులు దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా.. అకస్మాత్తుగా వరద పోటెత్తింది. దీంతో పలువురు వరదలో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఇంకొంత మంది ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. దాదాపు 50 మందిని పోలీసులు రక్షించారు. 13 మందికి స్వల్పగాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు.

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలతో నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని బెంగాల్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి, మాల్ ఎమ్మెల్యే బులు చిక్ బరైక్ తెలిపారు. నదిలో అకస్మాత్తుగా వరద పోటెత్తిన సమయంలో తాను సంఘటనా స్థలంలోనే ఉన్నానని, వరదలో భక్తులు కొట్టుకుపోవడాన్ని కళ్లారా చూశానని ఆయన చెప్పారు. ఇక ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు.