
- 70 కి పైగా శాంపిళ్ల సేకరణ
- ఆప్తుల నుంచి రెండు దఫాలుగా రక్త పరీక్షలు
సంగారెడ్డి, వెలుగు: పాశమైలారం సిగాచి పేలుడు ఘటనలో ఇంకా 8 మంది కార్మికులకు సంబంధించి ఆచూకీ సోమవారం సైతం దొరకలేదు. రెండు రోజులుగా రెస్క్యూ టీం శ్రమిస్తున్న వారి అవశేషాలు లభించడంలేదు. శిథిలాల తొలగింపు తర్వాత ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలు, మాంసపు ముద్దలు, రక్తంతో ఉన్న రాళ్లను సేకరించి 70కి పైగా శాంపిల్స్‌ను డీఎన్‌ఏ రిపోర్టుల కోసం పంపించారు. ప్రమాద స్థలంలో అధికారుల పర్యవేక్షణలో సహాయక బృందాలు జల్లెడ పట్టారు. మట్టిని తవ్వి నమూనాలు కూడా సేకరించారు.
సాయంత్రానికి ఎట్టకేలకు పదుల సంఖ్యలో ఎముకలు ఇతర అవశేషాలను సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపారు. ఆ ఫలితాలను రక్తసంబంధీకుల డీఏఎన్ తో మ్యాచ్ చేస్తున్నారు. తొమ్మిది మంది ఆచూకీ దొరక్కపోగా.. వారిలో కేవలం ఒక్కరి డీఎన్ఏ అవశేషాలతో సరిపోయింది. దొరికిన ఎముక యూపీకి చెందిన చికెన్ సింగ్ దని అధికారులు ప్రకటించారు. మిగతా 8 మంది గురించి నిర్ధారించాల్సి ఉంది. ప్రమాద స్థలంలో సేకరించిన అవశేషాలను గుర్తించేందుకు 8 మంది కుటుంబసభ్యుల నుంచి మరో మారు బ్లడ్ శాంపిల్స్ కు తీసుకున్నారు. సోమవారం రాత్రి వరకు కూడా డెడ్ బాడీల గురించి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
నేడు ఎన్‌డీఎమ్‌ఏ బృందం రాక
సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం మంగళవారం రానుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించి పేలుడుకు గల కారణాలపై అధ్యయనం చేయనుంది. ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం నివేదిక ఇవ్వనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించనుంది. ఘటనా స్థలాన్ని ఎక్స్‌పర్ట్స్, హై లెవెల్ కమిటీలు పరిశీలించిన విషయం తెలిసిందే. వాటి నివేదికలు కూడా రావాల్సి ఉన్నాయి.