సజీవదహనం కేసు..హత్య కేసుగా మార్చి దర్యాప్తు: సీపీ చంద్రశేఖర్ రెడ్డి

సజీవదహనం కేసు..హత్య కేసుగా మార్చి దర్యాప్తు: సీపీ చంద్రశేఖర్ రెడ్డి
  • ప్రియుడితో కలసి 4 నెలల కిందే ప్లాన్ చేసి  చంపించిన శాంతయ్య భార్య సృజన

పెద్దపల్లి జిల్లా: మందమర్రి మండలం వెంకటాపూర్ గుడిపల్లిలో జరిగిన ఆరుగురి సజీవదహనం కేసును హత్యగా కేసుగా మార్చి విచారిస్తున్నామని రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కేసు దర్యాప్తు స్పీడుగా జరుగుతోందని,  అన్ని వివరాలు త్వరలోనే మీడియాకు వవిరిస్తామని సీపీ తెలిపారు. పోలీసుల వివరణ ఇలా ఉండగా.. ఆరుగురి హత్యకు శాంతయ్య భార్య సృజన ముందే పక్కా ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విహేతర సంబంధమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ హత్యలు చేసినందుకు 30 లక్షల విలువైన భూమి ఇచ్చేట్లు ముందే ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇదే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

హత్యలు చేసినందుకు ప్రతిఫలంగా రూ.30 లక్షల భూమి

సంచలనం సృష్టించిన ఆరుగురి సజీవ దహనం ఘటన.. ప్లాన్డ్​ మర్డర్​ అని తెలుస్తోంది. మొన్న శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు విచారిస్తున్న కొద్దీ అనేక కొత్త విషయాలతోపాటు వివాహేతర సంబంధం.. కుటుంబ సభ్యుల కలహాలే కారణాలని గుర్తించినట్లు సమాచారం. సింగరేణి కార్మికుడు శనిగారపు శాంతయ్య భార్య సృజన.. తన ప్రియుడు లక్షెట్టిపేటకు చెందిన మేడి లక్ష్మణ్​ సాయంతో హత్యలు చేయించినట్లు బలమైన ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. శాంతయ్య రాజ్యలక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానం పెంచుకున్న సృజ న.. ఆయన ఆస్తులన్నీ రాజ్యలక్ష్మికే దక్కుతాయని, భవిష్యత్తులో తన కొడుకులకు వారసత్వ ఉద్యోగం కూడా రాదన్న భయంతో హత్యలు చేయించినట్లు తెలుస్తోంది. సీన్​రీకన్ స్ట్రక్షన్ చేయాలని అనుకుప్పటికీ ఎందుకో ఆగిపోయింది. 

కుటుంబంలో గొడవలే కారణం ?

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లికి చెందిన మాసు శివయ్య, రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ దంపతులు. శ్రీరాంపూర్​ఏరియా ఆర్కే-5బీ బొగ్గు గనిలో మైనింగ్ సర్దార్​గా పని చేస్తున్న శాంతయ్యకు వీళ్లతో కొన్నేండ్ల కింద పరిచయం ఏర్ప డింది. శాంతయ్య తన కుటుంబాన్ని వదిలేసి రాజ్యలక్ష్మితో సహజీవనం చేస్తున్నాడు. శాంతయ్య కొద్ది రోజుల కింద ప్లాట్ అమ్మగా వచ్చిన డబ్బుల్లో దాదాపు రూ.15 లక్షలు కూడా  రాజ్యలక్ష్మికి ఇచ్చినట్లు తెలిసింది. ఈ డబ్బు గురించి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. నెల కింద శ్రీరాంపూర్ పీఎస్​​లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. 

శాంతయ్యకు దూరమై.. లక్ష్మణ్కు దగ్గరై మర్డర్ ప్లాన్ చేసిన సృజన

శాంతయ్య దూరం కావడంతో లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూరుకు చెందిన మేడి లక్ష్మణ్ కు సృజన దగ్గరైనట్లు తెలిసింది. శాంతయ్య, రాజ్యలక్ష్మిని ఎలాగైనా హత్య చేయాలని భావించిన సృజన.. ఇందుకు లక్ష్మణ్​సాయం కోరిందని, ఉత్కూరులో ఉన్న రూ.30 లక్షల విలువైన భూమిని ప్రతిఫలంగా ఇచ్చేందుకు 4 నెలల ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. హత్యల కోసం లక్ష్మణ్ తన దోస్తులైన రమేశ్, సమ్మయ్య సాయం తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. నెల కింద ఈ ముగ్గురూ శాంతయ్యను కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేయగా ఆయన వారి నుంచి తప్పించుకున్నాడు. ఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులుగా డ్యూటీకి వెళ్లకుండా గుడిపెల్లిలోని రాజ్యలక్ష్మి ఇంట్లోనే ఉంటున్నాడు. 

శుక్రవారం ఇద్దరూ ఇంట్లో ఉన్న విషయం తెలుసుకున్న లక్ష్మణ్..  రమేశ్​తో కలిసి నస్పూర్ లోని ఓ పెట్రోల్ బంక్ లో రాత్రి 9 గంటల టైమ్ లో 40 లీటర్ల  పెట్రోల్ కొన్నాడు. ఆయన ఆటోలో వచ్చి  పెట్రోల్ తీసుకెళ్తున్న దృశ్యాలు పెట్రోల్ బంక్ సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాళ్లు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో రాజ్యలక్ష్మి ఇంటికి బయట నుంచి గడియపెట్టి నిప్పు పెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇల్లంతా కాలిపోయి శాంతయ్య, రాజ్యలక్ష్మి సహా ఆమె భర్త శివయ్య, అక్క కూతురు మౌనిక, ఆమె ఇద్దరు బిడ్డలు చనిపోయారు.