నిరాశ్రయులకు సాయం చేస్తున్న ‘బుల్లి రైటర్’

నిరాశ్రయులకు సాయం చేస్తున్న ‘బుల్లి రైటర్’

ఐప్యాడ్‌‌తో ఆడిపాడాల్సిన వయసులో ఓ ఇంగ్లాండ్‌‌ చిన్నారి చేసిన పని అందరితో శెభాష్ అనిపిస్తోంది. ఎనిమిదేళ్ల వయసులో ఏకంగా కామిక్‌‌ రైటర్‌‌ అవతారమెత్తాడు. ఆ డబ్బుతో నిరాశ్రయులుగా రోడ్ల మీద కాలం వెళ్లదీస్తున్న వాళ్లకు సాయం చేస్తున్నాడు. అతని పేరు ఎథాన్‌‌ వెల్ష్‌‌.  మాంచెస్టర్‌‌లోని టింపెర్లి అతనుండే ఊరు. తండ్రితో  ఒకరాత్రి బయటకు వెళ్లిన అతనికి చలితో వణికిపోతున్న కొందరు కనిపించారు. వాళ్లకు తనలా ఇల్లు లేదని తెలుసుకుని పాపం అనుకున్నాడు. ఎథాన్‌‌కి ‘స్ప్లాటూన్‌‌’ ఫేవరెట్ క్యారెక్టర్‌‌. ఆ క్యారెక్టర్‌‌తోనే అడ్వెంచర్‌‌ కామిక్‌‌ బుక్స్‌‌ని సిద్ధం చేశాడు. ఆ ఒరిజినల్‌‌ కాపీతో సరాసరి ఇన్‌‌స్టాంట్‌‌ప్రింట్‌‌ అనే పబ్లిషింగ్ ఆఫీస్‌‌కు చేరుకున్నాడు.

తన జేబులోని మూడు పౌండ్లను, ఒక లెటర్‌‌ను అక్కడి స్టాఫ్‌‌కి అందించాడు. ఆ లెటర్‌‌లో తాను చేయబోయే మంచి పని గురించి రాశాడు. ఆ చిన్నారి ఆలోచన వాళ్లకు నచ్చింది. ఫ్రీగా పబ్లిష్‌‌ చేసేందుకు ముందుకొచ్చింది ఆ కంపెనీ. ‘ఈరోజుల్లో గాడ్జెట్స్‌‌కి అలవాటు పడుతున్న పిల్లల్నే చూస్తున్నాం. కానీ, ఎథాన్‌‌ మాత్రం స్కెచ్‌‌, పేపర్ సాయంతో బొమ్మలు గీస్తున్నాడు. ఆ క్రియేటివిటీ మమ్మల్ని ఆకర్షించింది. ఇంత చిన్నవయసులో అతని ఆలోచనకు హ్యాట్సాఫ్‌‌’ అని ఇన్‌‌స్టాప్రింట్ ఫౌండర్ అడమ్‌‌ కర్నెల్‌‌ చెబుతున్నాడు. ఎథాన్‌‌ చేస్తున్న పని తెలుసుకుని అతని పేరెంట్స్‌‌ గర్వంగా ఫీలవుతున్నారు.