24 గంటల్లో.. 8 వేల మందికే

24 గంటల్లో.. 8 వేల మందికే

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికే వైరస్​ బారిన పడి, కోలుకుంటున్నోళ్ల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా వైరస్​కు చిక్కుతున్న వాళ్లు తక్కువగా ఉంటున్నరు. దీంతో యాక్టివ్​ కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత సోమవారం కొత్త కేసులు, యాక్టివ్​ కేసులు అత్యంత తక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో(సోమవారం ఉదయం 8 గంటల వరకు) కొత్తగా 8,488 మందికి కరోనా సోకింది. వీరిని కలుపుకుంటే ఇప్పుడు దేశంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 1,18,443 గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3 కోట్ల 45 లక్షల 18 వేల 901 మందికి కరోనా సోకిందని వివరించారు. ఇక వైరస్​కారణంగా ఇప్పటి వరకు 4 లక్షల 65 వేల 911 మంది చనిపోయారని, గడిచిన 24 గంటల్లో 249 మంది మృతి చెందారని అధికారులు చెప్పారు. 

45 రోజులుగా 20 వేల లోపే..
వ్యాక్సినేషన్​లో వేగం పెంచడం, వైరస్​ కట్టడికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో కొద్దిరోజులుగా కొత్త కేసులు తగ్గుతున్నయ్. గడిచిన 45 రోజులుగా దేశంలో వైరస్​ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య 20 వేల లోపే ఉంటోందని అధికారులు తెలిపారు. దాదాపు 5 నెలల నుంచి కరోనా కేసులు 50 వేల లోపే నమోదవుతున్నాయని చెప్పారు. కిందటేడాది మార్చి తర్వాత మళ్లీ ఇప్పుడే వైరస్​ ఇన్​ఫెక్షన్​ రేట్ 0.34 శాతం నమోదైందని, రికవరీ రేట్​ విషయానికి వస్తే  98.31 శాతంగా ఉందని వివరించారు. రోజువారీ పాజిటివిటీ రేట్ 1.08 శాతంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 116.87 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు​వేసినట్లు తెలిపారు. 

కేరళలోనే ఎక్కువ..
దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్నా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఒక్క కేరళలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసులలో దాదాపు సగానికి పైగా కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన 8,488 కేసులలో కేరళ రాష్ట్రం నుంచే 5,080 మంది బాధితులు ఉన్నారు. ఇక్కడ మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సోమవారంతో గడిచిన 24 గంటల్లో దేశంలో 249 మంది కరోనా కారణంగా చనిపోగా.. అందులో కేరళకు చెందిన వారు196 మంది అని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. కరోనా మృతులలో ఎక్కువ శాతం మంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్లేనని వివరించారు.

కేసులు ఎప్పుడెట్లా..
మన దేశంలో కరోనా మహమ్మారి బారిన పడ్డోళ్ల సంఖ్య 2020 ఆగస్టు 7 నాటికి మొత్తం 20 లక్షలకు చేరగా.. తర్వాత కేవలం 16 రోజులకే అంటే అదే నెల 23న ఈ సంఖ్య 30 లక్షలకు, అదే ఏడాది సెప్టెంబర్​ 5 నాటికి 50 లక్షలకు చేరింది. కిందటేడాది డిసెంబర్​ 19న మన దేశంలో మొత్తం కోటి మంది ఈ వైరస్​ బారిన పడ్డారు. ఈ ఏడాది మే 4 న వైరస్​ బాధితుల సంఖ్య 3 కోట్లకు చేరింది.

జనవరిలో పిల్లలకు వ్యాక్సిన్!
పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలన్న అంశంపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. మరో రెండు వారాల్లో అత్యున్నత స్థాయి సలహా సంఘం సమావేశం కానుంది. చిన్నారులకు వ్యాక్సిన్లు, పెద్దలకు బూస్టర్ డోసు ఇచ్చే అంశాలను ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు 2022 జనవరి నుంచి, చిన్నారులందరికీ మార్చి నుంచి వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. పలు దేశాల్లో రెండు డోసుల టీకా తీసుకున్న వారికి అదనంగా బూస్టర్ డోసు ఇస్తుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఆ దిశగా దృష్టి సారించింది.