ఫేస్ పౌడర్ పేరుతో డ్రగ్స్ స్మగ్లింగ్: రూ.879 కోట్ల హెరాయిన్ సీజ్

ఫేస్ పౌడర్ పేరుతో డ్రగ్స్ స్మగ్లింగ్: రూ.879 కోట్ల హెరాయిన్ సీజ్

ముంబై: మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.879 కోట్ల విలువ చేసే సుమారు 300 కిలోల హెరాయిన్ ను సీజ్ చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆదివారం వెల్లడించింది. జిప్సమ్ స్టోన్, ఫేస్ పౌడర్ అన్న పేరుతో అఫ్ఘానిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా స్మగ్లింగ్ చేస్తుండగా రాయగడ్ పోర్టులో గురువారం పట్టుకున్నట్లు వివరించింది. ఇటీవల కాలంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం ఇదేనని డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఆ డ్రగ్స్ పార్శిల్ కు సంబంధించిన ఇపోర్ట్స్, ఎక్స్ పోర్ట్స్ కోడ్ పంజాబ్ కు చెందిన ప్రభుజోత్ సింగ్ అనే వ్యక్తి పేరుతో ఉందని చెప్పారు. దీంతో అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గత ఏడాది నుంచి జిప్సమ్, ఫేస్ పౌడర్ లను అతడు ఇపోర్ట్ చేసుకుంటున్నాడని పేర్కొన్నారు. దీనిపై లోతుగా ఎంక్వైరీ చేయాల్సి ఉందని, దీని వెనుక ఎవరున్నారు? డ్రగ్స్ నెట్ వర్క్ ఎవరితో లింక్ అయ్యి ఉందో తేల్చాల్సి ఉందని తెలిపారు. కాగా, గత ఏడాది ఆగస్టులో ఇదే పోర్టులో రూ. వెయ్యి కోట్ల విలువైన హెరాయిన్ ను ఆయుర్వేదిక్ మెడిసిన్ పేరుతో ఇంపోర్ట్ అవుతుండగా డీఆర్ఐ సీజ్ చేసింది. ఆ డ్రగ్స్ కూడా అఫ్ఘానిస్థాన్ నుంచే వచ్చాయి.