కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 9 మంది మృతి

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 9 మంది మృతి
  • ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి
  • మ‌రో ముగ్గురి ప‌రిస్థితి విష‌మం
  • జ‌గ్గ‌య్య‌పేట్ వేదాద్రి వ‌ద్ద ట్రాక్ట‌ర్- లారీ ఢీ
  • దేవుని ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా ఘ‌ట‌న‌
  • ప్ర‌మాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
  • స‌హాయ‌క చ‌ర్య‌లు అందించాల్సిందిగా అధికారుల‌కు ఆదేశం

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌- లారీ ఢీకొన్న ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతులంతా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీరంతా వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఆలయ సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న సిమెంట్‌ లారీ వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కాగా.. రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా వాసులు దుర్మరణం చెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా అధికారులను సిఎం ఆదేశించారు.

ఎర్రుపాలెం మండలం పెద్దగోపారం లో విషాదం

ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

జగ్గయ్యపేట లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం గ్రామంలో వేమి రెడ్డి గోపిరెడ్డి కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. వేమిరెడ్డి గోపిరెడ్డి మొక్కు తీర్చుకునేందుకు నిన్న రాత్రి ఏడు గంటలకు వేలాద్రి వెళ్లి మొక్కులు తీర్చుకొని ఈరోజు తిరిగివస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వేమిరెడ్డి గోపి రెడ్డి తాత పుల్లారెడ్డి, నాయనమ్మ భారతమ్మ, తల్లి పద్మావతి, కుమార్తె ఉదయశ్రీ, మేనల్లుడు నర్సిరెడ్డి మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత గురికావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వీరితో పాటు కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన గూడూరు సూర్యనారాయణ రెడ్డి,ఉపేందర్ రెడ్డి, జమలాపురం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి అప్పమ్మ, లక్కిరెడ్డి రాజేశ్వరి, తిరుపతమ్మ లు మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లు,కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.