జాతీయ స్థాయి వుషూ పోటీలకు 9 మంది ఎంపిక

జాతీయ స్థాయి వుషూ పోటీలకు 9 మంది ఎంపిక

భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లాకు చెందిన 9 మంది ఖేలో ఇండియా క్రీడాకారులు జాతీయ స్థాయి వుషూ పోటీలకు ఎంపికయ్యారు. సోమవారం మంచిర్యాల జిల్లాలోని సీతారామ కల్యాణ మండపంలో అమెచ్యూర్ వుషూ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో వుషూ రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు జరిగాయి. ఇందులో నిర్మల్ ​జిల్లాలోని ఖేలో ఇండియా శిక్షణ కేంద్రాలకు చెందిన 10 మంది క్రీడాకారులు పాల్గొనగా 9 మంది పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఆవునూర్ వార్ ప్రతీక్ష, లోలం రాజశ్రీ, ఎడివెల్లి మృణాళిని బంగారు పతకాలు సాధించగా.. నాంపెల్లి శివ ప్రసాద్, ఒడ్నం గజేందర్, జాదవ్ కిరణ్, సాయి కిరణ్ రజత పతకాలు, శ్రీ రాముల సాయికిరణ్, గుండెగల్లా జ్ఞానతేజ కాంస్య పతకాలు సాధించారు.

వీరందరూ వచ్చే నెల ఉత్తరాఖండ్​లోని డెహ్రాడూన్ లో జరిగే 33వ సీనియర్ జాతీయ స్థాయి వుషూ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొననున్నట్లు కోచ్ జి.జ్ఞానతేజ తెలిపారు. వీరిని జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా మార్షల్ ఆర్ట్స్ అధ్యకుడు తేజేందర్ సింగ్ బాటియా, ట్రైనర్లు శ్రీకాంత్, శ్రీరాముల సాయికృష్ణ, శివరాజ్ గౌడ్, నితిన్ గౌడ్ అభినందించారు.