సీఆర్పీఎఫ్ లో 335 మంది జ‌వాన్ల‌కు క‌రోనా.. అత్య‌ధికంగా బీఎస్ఎఫ్ లో..

సీఆర్పీఎఫ్ లో 335 మంది జ‌వాన్ల‌కు క‌రోనా.. అత్య‌ధికంగా బీఎస్ఎఫ్ లో..

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దేశ ర‌క్ష‌ణ‌లో ఉన్న జ‌వాన్ల‌లోనూ వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 335 మందికి క‌రోనా సోకింది. గురువారం ఒక్క రోజు 9 మందికి క‌రోనా పాజ‌టివ్ వ‌చ్చిందని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. అలాగే ఇవాళ కొత్త‌గా ఒక‌రు మ‌ర‌ణించ‌గా.. మృతుల సంఖ్య రెండుకు చేరిన‌ట్లు చెప్పారు. క‌రోనా నుంచి కోలుకుని ఇప్ప‌టి వ‌ర‌కు 212 మంది డిశ్చార్జ్ కాగా.. 121 మంది జవాన్లు చికిత్స పొందుతున్నార‌ని వివ‌రించారు.

అత్య‌ధికంగా బీఎస్ఎఫ్ జవాన్ల‌లో 361 కేసులు

సైనిక బ‌ల‌గాల్లో అత్య‌ధిక క‌రోనా కేసులు బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో న‌మోద‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 361 మంది బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా సోకింది. అయితే గురువారం కొత్త కేసులేవీ రాలేద‌ని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 25 మంది క‌రోనా నుంచి కోలుకోవ‌డంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 274కు చేరింద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం 87 మంది ఢిల్లీ స‌హా వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌న్నారు. ఇక, ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీస్ (ఐటీబీపీ) బ‌ల‌గాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 119 క‌రోనాకేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త కేసులు న‌మోదు కాలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు 67 మంది డిశ్చార్జ్ కాగా.. 52 మంది చికిత్స పొందుతున్నారు.