ఉత్తరప్రదేశ్​లో 13 నెలల్లో 9 మంది మహిళల హత్య

ఉత్తరప్రదేశ్​లో 13 నెలల్లో 9 మంది మహిళల హత్య
  •  చెరుకు తోటల్లో చీరలతో గొంతునులిమి దారుణం 
  • ఉత్తరప్రదేశ్​లో సీరియల్ కిల్లర్ కలకలం

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌ బరేలీలోని గ్రామీణ ప్రాంతంలో ఓ సీరియల్ కిల్లర్ గడిచిన13 నెలల్లో ఒకే వయస్సున్న తొమ్మిది మంది మహిళలను హత్య చేశాడు. మహిళలను బలవంతంగా చెరుకు తోటల్లోకి లాక్కెళ్లి..వాళ్లు కట్టుకున్న చీరలతోనే గొంతునులిమి కిరాతకంగా చంపేశాడు. గతేడాది షాహి, షీష్‌‌‌‌‌‌‌‌గఢ్, షెర్‌‌‌‌‌‌‌‌గఢ్ పరిధిలో  40 నుంచి-65 ఏళ్ల మధ్య వయసున్న ఎనిమిది మంది మహిళలు హత్యకు గురయ్యారు. 

కానీ చనిపోయినవారిలో ఎవరిపైనా  అత్యాచారం జరగలేదు. గతేడాది జూన్‌‌‌‌‌‌‌‌లో మూడు హత్యలు, జూలై, ఆగస్టు, అక్టోబర్‌‌‌‌‌‌‌‌లలో ఒక్కొక్కటి, నవంబర్‌‌‌‌‌‌‌‌లో రెండు హత్యలు జరిగాయి. హత్యలన్నీ ఒకే విధంగా జరగడంతో ఇది సీరియల్ కిల్లర్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. 300 మంది పోలీసులతో 14 టీమ్స్ ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా నిఘా పెంచడంతో హత్యలు ఆగిపోయాయి. 

ఏడు నెలలు సైలెంట్

పోలీసుల నిఘా పెరగడంతో  ఏడు నెలల పాటు సైలెంట్ గా ఉన్న  సీరియల్ కిల్లర్ ఈ ఏడాది మళ్లీ హత్యలు చేయటం స్టార్ట్ చేశాడు. షేర్‌‌‌‌‌‌‌‌ఘర్‌‌‌‌‌‌‌‌లోని భుజియా జాగీర్ గ్రామానికి చెందిన అనిత(45)ను జులై 2న దారుణంగా చంపేశాడు. ఆమె డెడ్ బాడీ సమీపంలోని చెరకు తోటలో లభ్యం కాగా, ఆమె ధరించిన చీరతోనే గొంతుకోసి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. 

దాంతో పోలీసులు మళ్లీ అలెర్ట్ అయ్యారు. హత్యలు జరిగిన ప్రాంతాలకు చెందిన పలువురితో మాట్లాడి.. ముగ్గురు అనుమానితుల స్కెచ్‌‌‌‌‌‌‌‌లను విడుదల చేశారు. అంతేగాక టీమ్స్ ఏర్పాటు చేసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. చెక్‌‌‌‌‌‌‌‌పోస్టుల వద్ద తనిఖీలు పెంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేశారు.