
- తొలి విడతగా పలు జిల్లాల్లో 90 ఏర్పాటు
- స్వచ్ఛ భారత్ మిషన్ కింద క్లస్టర్ వారీగా యూనిట్లు
- నాలుగైదు మండలాలకు కలిపి ఎకరా విస్తీర్ణంలో నిర్మాణం
- కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లాల్లో స్థల సేకరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) గ్రామీణ పథకంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. పరిశుభ్రతను మరింత మెరుగుపర్చడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్ ప్లస్) పల్లెలుగా తీర్చిదిద్దుతున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలి విడతలో 90 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం ఒక్కో యూనిట్‌కు రూ.64 లక్షలు కేటాయించగా.. యంత్రాల కొనుగోలుకు రూ.24 లక్షలు, షెడ్డు నిర్మాణానికి రూ.40 లక్షలు వినియోగించనున్నారు.
కాగా, యూనిట్ నిర్మాణాన్ని మూడు దశల్లో గ్రౌండింగ్ చేసి జియో ట్యాగింగ్ చేయనున్నారు. ప్రతి యూనిట్‌పై ఎస్‌బీఎం లోగో, ట్యాగ్‌లైన్ పెయింట్‌తో వేయనున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని నిర్వహణ చేపట్టనున్నారు.
జిల్లాల వారీగా యూనిట్ల వివరాలు ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా యూనిట్ల స్థాపనకు అనువైన ప్రాంతాలను గుర్తించే పనిలో కలెక్టర్లు, డీఆర్‌డీఏ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్థల సేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. మరికొన్ని జిల్లాల్లో స్థలాల కోసం చూస్తున్నారు. యూనిట్ల నిర్మాణం కోసం టెండర్లను కూడా ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 90 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు ఏర్పాటు చేస్తుండగా.. నల్గొండ జిల్లాలో 5, ఖమ్మంలో 4, నాగర్‌కర్నూల్ 4, నిజామాబాద్ 4, రంగారెడ్డి 4, సంగారెడ్డి 4, సూర్యాపేట 4, సిద్దిపేట 4, భద్రాద్రి కొత్తగూడెం 3, కామారెడ్డి 2, జగిత్యాల 3, కుమ్రం భీం ఆసిఫాబాద్ 3, మహబూబాబాద్ 3, మహుబూబ్ నగర్ 3, వికారాబాద్ 3, మెదక్ 3, జనగామ 2, జోగులాంబ గద్వాల 2, మేడ్చల్ 3, ములుగు 2, నారాయణపేట 2, పెద్దపల్లి 2, వనపర్తి 2, యాదాద్రి భువనగిరి 2, నిర్మల్ 3, కరీంనగర్ 2, ఆదిలాబాద్ 3, హనుమకొండ 2, జయశంకర్ భూపాలపల్లి 2, వరంగల్ 2, రాజన్న సిరిసిల్ల 2 చొప్పున యూనిట్లు నెలకొల్పనున్నారు.
క్లస్టర్ల వారీగా యూనిట్ల ఏర్పాటు..
స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ పథకం కింద 2025–-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.516.40 కోట్లు మంజూరు చేసింది. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వాటా కలిగి ఉంది. తొలి విడతలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ల నిర్మాణానికి రూ.57.60 కోట్లు కేటాయించింది. యూనిట్ల కోసం నాలుగైదు మండలాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో యూనిట్ నెలకొల్పనున్నారు. రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్, నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. రోజుకు కనీసం 2 టన్నుల చెత్తను సేకరించి ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఈ యూనిట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రెండు పద్ధతుల్లో వేరు చేయనున్నారు.
బేలింగ్ (ముద్దగా చేసి ప్యాకింగ్ చేయడం), ష్లెడింగ్ (చిన్న చిన్న పీస్‌లుగా చేయడం) విధానాన్ని అనుసరించనున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి వివిధ ఉత్పత్తులను తయారు చేయడం, పునర్వినియోగానికి అనుకూలంగా లేని వాటిని దహనం, ల్యాండ్ ఫిల్లింగ్ చేయడమే లక్ష్యంగా ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా కాలుష్య నియంత్రణతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ప్లాస్టిక్ రీసైక్లింగ్‌తో విలువైన వనరులు ఆదా..
ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ల కోసం స్థల సేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. వీలైనంత త్వరగా వీటిని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఈ యూనిట్ల ద్వారా గృహాలు, వ్యాపారాలు, రద్దీ ప్రాంతాలతో పాటు వివిధ వనరుల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రెసిన్ గుర్తింపు కోడ్ (ఆర్ఐసీఎస్)ల ఆధారంగా వివిధ రకాల వస్తువులుగా మారుస్తారు. ప్రాసెస్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ లేదా ఇతర రికవరీ ప్రక్రియల ద్వారా వివిధ ఉత్పత్తులను తయారు చేయనున్నారు. పునర్వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం లేదా ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తారు. ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయడం ద్వారా విలువైన వనరులు ఆదా చేయవచ్చు.
- సృజన, పీఆర్, ఆర్డీ డైరెక్టర్