కేసీఆర్‌ మీద వ్యతిరేత ఉంది కాబట్టే 93శాతం పోలింగ్ : రాజగోపాల్ రెడ్డి

కేసీఆర్‌ మీద వ్యతిరేత ఉంది కాబట్టే 93శాతం పోలింగ్ : రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో తనదే విజయమని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక మునుగోడు ప్రజల కోసం వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కుటుంబ పాలన పోవాలని, ఈ తీర్పుతో తెలంగాణలో మార్పు జరుగుతుందని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక తప్పనిసరిగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడం వల్లే పోలింగ్ శాతం పెరిగిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మునుగోడులోనే తిష్టవేసి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. పోలింగ్ డే వరకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గాన్ని విడిచివెళ్లకుండా.. మునుగోడులోనే ఉన్నారని చెప్పారు. పోలింగ్  సమయంలో ప్రజలు ఏం చెప్పాలో తెలియక టీఆర్ఎస్ కే ఓటేశామంటూ ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో చెప్పారని తెలిపారు. ఉప ఎన్నికలో ఎవరు గెలిచినా 5వేల మెజార్టీతోనే గెలుస్తారని, ఇప్పుడున్న సైలెంట్ ఓటింగ్ అనేది ప్రభుత్వ వ్యతిరేకంగానే జరిగిందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఒకవేళ సైలెంట్ ఓటింగ్ అనేది బీజేపీకి అనుకూలంగా పడితే తాను తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
 
మునుగోడు నియోజకవర్గంలో బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద 144సెక్షన్ విధించారు. 47మంది పోటీలో ఉన్నందున ఒక్కో ఫలితం రావడానికి కనీసం అరగంట సమయం పట్టే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఉండడంతో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2గంటల వరకు సాగనున్నట్టు తెలుపుతున్నారు.