గ్లోబల్​ పీస్ ర్యాలీకి 97 దేశాల ప్రతినిధులు

గ్లోబల్​ పీస్ ర్యాలీకి 97 దేశాల ప్రతినిధులు
  • హైదరాబాద్​కు ప్రపంచ దేశాల అధినేతలు వస్తున్నరు
  • గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ చైర్మన్ కేఏ పాల్ వెల్లడి

ఖైరతాబాద్, వెలుగు: ప్రపంచ శాంతి కోసం అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ర్యాలీ, ఎకనామిక్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు గ్లోబల్ పీస్ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ప్రకటించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్​లోని జింఖానా గ్రౌండ్స్‌‌లో జరపనున్నట్లు వెల్లడించారు. బుధవారం బేగంపేట టూరిజం ప్లాజాలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్, గద్దర్, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, వీహెచ్, విమలక్కతో కలిసి కేఏపాల్ మీడియాతో మాట్లాడారు. గ్లోబల్ పీస్ ర్యాలీ, ఎకనామిక్ సమ్మిట్ కార్యక్రమానికి అన్ని దేశాల అధినేతలు,  ప్రతినిధులతో పాటు కేంద్ర మంత్రులు హాజరు కానున్నట్లు కేఏ పాల్  తెలిపారు. సుమారు 97 దేశాల ప్రతినిధులు హాజరవుతారన్నారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ ను ఆహ్వానించేందుకు అపాయింట్మెంట్ కోరామని ఆయన వెల్లడించారు. 24 గంటల్లో అపాయింట్మెంట్ కన్ఫార్మ్ చేయాలన్నారు. రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా ఈ సమ్మిట్ జరగనుందని అందరూ హాజరుకావాలని చెప్పారు. సమ్మిట్ కు తనను ఇన్వైట్ చేసినందుకు కేఏ పాల్ కు ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర మంత్రి పురుషోత్తం రుపాలా లెటర్ రాశారు.

శాంతి, ప్రేమ, అహింసకు సంబంధించి పాల్ చేసిన స్పీచ్ లు చాలా దేశాలకు రీచ్ అవుతోందన్నారు. శాంతి ర్యాలీని విజయవంతం చెయ్యాలని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్  కోదండరాం పిలుపునిచ్చారు. శాంతిని కోరుకోవడమంటే పరస్పర సహకారంలో సమాజ హితాన్ని కోరడమేనని పేర్కొన్నారు. అన్ని దేశాల నుంచి వచ్చే అధ్యక్షులను అహ్వానించి శాంతి కోసం ముందడుగు వెయ్యాలని కోరారు. గ్లోబల్ పీస్ ర్యాలీలో తానూ పాల్గొంటానని గద్దర్ అన్నారు. ప్రపంచ దేశాల అధినేతల ఆలోచనతోనే రాబోయే తరాల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ చంద్ర కుమార్ అన్నారు. శాంతి కోసం కేఏ పాల్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని  జయప్రదం చేయాలని ఆయన కోరారు.

సమాజంలో శాంతి కోసం తామూ ఉద్యమిస్తున్నామని అరుణోదయ సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు విమలక్క అన్నారు. వనరులు, సంపద వికేంద్రీకరణ జరగినప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందని తెలిపారు.ప్రపంచ శాంతి కోసం కేఏ పాల్ చేస్తున్న కృషి అభినందనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు.  మనదేశం ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. శాంతికి మార్గం లేదు శాంతే మార్గం అని పేర్కొన్న మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా గ్లోబల్ పీస్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించడం శుభసూచకమన్నారు. సమావేశం అనంతరం శాంతి ర్యాలీ, ఎకానమీ సమ్మిట్‌‌కు సంబంధించిన పోస్టర్‌‌ను ఆవిష్కరించారు.