97.38% రూ. 2వేల నోట్లు తిరిగొచ్చాయి : ఆర్‌బీఐ

 97.38% రూ. 2వేల నోట్లు తిరిగొచ్చాయి  : ఆర్‌బీఐ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. రూ. 2వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన నాటి నుంచి దాదాపుగా 97.38% ప్రజల నుంచి బ్యాంకులకు  తిరిగి వచ్చినట్లు  తెలిపింది. 2023 డిసెంబర్ 29 నాటికి రూ. 9,330 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఇప్పటికి ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది.  2023  మే 19 నాటికి రూ. 3.56 లక్షల కోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. 

రూ. 2వేల నోట్లను  2023 మే 19న ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన ఆర్‌బీఐ ..  సెప్టెంబర్ 30లోపు రూ. 2వేల నోట్లను  బ్యాంకుల్లో సమర్పించాలంది ..  ఆ తరువాత గడువును అక్టోబర్ 7 వ తేదీకి పొడిగించింది.  ఆ తరువాత బ్యాంకుల్లో రూ.  2 వేల నోట్ల స్వీకరణను నిలిపివేసింది.   అక్టోబర్ 9 నుంచి ఆర్‌బీఐ కార్యాలయాలలో మాత్రమే ఈ నోట్లు డిపాజిట్‌, మార్చుకునే అవకాశం కల్పించింది.  2016 నవంబర్‌లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది ఆర్‌బీఐ.  

ఆర్‌బీఐ కార్యాలయాలు ఇవే..
 
రిజర్వ్‌ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 19 ఉప కార్యాలయాలు ఉన్నాయి. అవి అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం. రూ.2వేల నోట్లను వీటిల్లో ఎక్కడైనా మార్చుకోవచ్చు.