
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 2020–21 విద్యా సంవత్సరానికి 176 ఇంజనీరింగ్ కాలేజీల్లో 97,741 సీట్లు అందుబాటులోకి ఉన్నాయని అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. 162 ప్రైవేటు కాలేజీల్లో మొత్తం 94,589 సీట్లు ఉండగా.. అందులో 66,213 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని చెప్పారు. జేఎన్టీయూ పరిధిలో 58,817 సీట్లు, ఓయూ పరిధిలో 6,062 సీట్లు, కేయూ పరిధిలో 1,334 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయని వెల్లడించారు. ఇక 14 గవర్నమెంట్ కాలేజీల్లో 3,152 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నరు. ఆదివారం వరకు 48,446 మంది స్టూడెంట్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో పాల్గొన్నారని తెలిపారు. ఈ నెల 20 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 22 వరకూ వెబ్ ఆప్షన్లకు లాస్ట్ డేట్ అని చెప్పారు.
వెబ్ ఆప్షన్లు మొదలుకాలే..
ఎంసెట్ ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లపై తొలిరోజు గందరగోళం నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి వరకూ కూడా ఈ ప్రక్రియ మొదలుకాలేదు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18 నుంచి 22 వరకూ వెబ్ ఆప్షన్ల గడువు ఉంది. శనివారం రాత్రిదాకా కూడా ఇంజనీరింగ్ కాలేజీలు, కోర్సులు, సీట్లపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. జేఎన్టీయూ, ఓయూ, కేయూ అధికారులు వాటిపై ఆదివారం పొద్దంతా కసరత్తు చేసి.. సాయంత్రానికి ఉన్నత విద్యామండలి ద్వారా ఎంసెట్ అడ్మిషన్ల కమిటీకి డేటా పంపారు. వివరాలన్నీ కాలేజీలు, కోర్సులు, సీట్ల వారీగా వెబ్ సైట్ లో అందుబాటులోకి తేవడానికి టైమ్ తీసుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు కోర్సులు, సీట్ల వివరాలు అందుబాటులోకి రాలేదు.