
భారతీయుల140 యేళ్ల కల..జమ్మూకాశ్మీర్ డోగ్రా రాజు మహారాజా ప్రతాప్ సింగ్ తలపెట్టిన లక్ష్యం..ఉధంపూర్-బారాముల్లా-శ్రీనగర్ రైలు లింక్ , చీనాబ్ వంతెన, అజ్నీవంతెన ప్రారంభంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రత్యక్ష రైలు ప్రయాణం కల సాకారమయింది. లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ఆటకం లేకుండా ఒకే రైలు ప్రయాణంతో భారత దేశం మొత్తం చుట్టిరావచ్చు.
చీనాబ్ ,అంజి ఖాడ్ వంతెనలను శుక్రవారం (2025, జూన్ 6న)ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ రెండు వంతెనలు జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్టులో కీలక భాగాలు. చీనాబ్ ,అంజి ఖాడ్ వంతెనల ప్రారంభంతో చాలా కాలంగా ఒంటరిగా ఉన్న కాశ్మీర్ రైలు మార్గం చివరకు భారతదేశ జాతీయ రైల్వే నెట్‌వర్క్‌లో విలీనం అయింది. దీంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రత్యక్ష రైలు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి కల నిజమైంది:ప్రధాని మోదీ
రైల్వే నెట్‌వర్క్ ద్వారా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనుసంధానం సాధ్యమైందని ప్రధాని మోదీ అన్నారు. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని చెప్పారు. చీనాబ్ ,అంజి వంతెనలు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి గేట్‌వేలుగా నిలుస్తాయన్నారు. ఈ ప్రాంతంలో పర్యాటకం, ఆర్థిక అభివృద్ధికి ఇవి ఎంతగానో తోడ్పడతాయని ప్రధాని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని..తమ ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. "మంచి పనులన్నీ నాకే మిగిలి ఉన్నాయని" ఆయన చమత్కరించారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేయడంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, కార్మికులు ,అధికారులతో ప్రధాని మోదీ ముచ్చటించి వారి కృషిని ప్రశంసించారు.
చీనాబ్ వంతెన
చీనాబ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన. ఇది జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించారు. ఈ వంతెన నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే సుమారు 35 మీటర్లు ఎక్కువ. దీని మొత్తం పొడవు 1,315 మీటర్లు.
నిర్మాణ ప్రత్యేకతలు..దీనిని ఉక్కు ,కాంక్రీటుతో నిర్మించారు. 28వేల660 మెగా టన్నుల ఉక్కును ఉపయోగించారు. -10 డిగ్రీల నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునేలా, అలాగే గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులను, భూకంపాలను తట్టుకునేలా ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన జీవితకాలం 120 సంవత్సరాలు అని అంచనా.
►ALSO READ | చీనాబ్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన బ్రిడ్జి ఇదే
ప్రాముఖ్యత: ఈ వంతెన కాశ్మీర్ లోయకు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది. ఇది ఈ ప్రాంతంలో పర్యాటకం, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది.
అంజి ఖాడ్ వంతెన
అంజి ఖాడ్ వంతెన భారతదేశపు మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన. ఇది చీనాబ్ నదికి ఉపనది అయిన అంజి నదిపై రియాసి జిల్లాలో నిర్మించారు. ఈ వంతెన మొత్తం పొడవు 473.25 మీటర్లు, నదీగర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఒకే పైలాన్‌ను (స్తంభం) కలిగి ఉంది. దీని ఎత్తు దాని పునాది నుంచి 193 మీటర్లు. మొత్తం 48 కేబుల్స్ మద్దతుతో ఈ వంతెన నిర్మించారు. దీని డిజైన్ అస్సిమెట్రికల్‌గా ఉంటుంది. కేబుల్స్ 82 నుంచి295 మీటర్ల పొడవు ఉన్నాయి. గంటకు 213 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకోగలదు. ఇది చీనాబ్ వంతెన తర్వాత భారతదేశంలో రెండో ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకుంది.
ప్రాముఖ్యత: ఈ వంతెన కత్రా ,రియాసి మధ్య కీలకమైన అనుసంధానాన్ని అందిస్తుంది. USBRL ప్రాజెక్ట్‌లో ముఖ్య భాగంగా నిర్మించారు. ఈ బ్రిడ్జి ద్వారా కాశ్మీర్ లోయకు రవాణా సౌకర్యాలను మెరుగయ్యాయి.
చీనాబ్, అంజి ఖాడ్ వంతెనలు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రవాణా ,అనుసంధానం చేయడంతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. ఇంజనీరింగ్‌లో భారతదేశం అసాధారణ సామర్థ్యాన్ని ఇవి చాటిచెప్పాయి.