వరద నీటిలో బంగారు ఆభరణాల బ్యాగు గల్లంతు.. న‌గలు మాయం

వరద నీటిలో బంగారు ఆభరణాల బ్యాగు గల్లంతు.. న‌గలు మాయం

హైద‌రాబాద్: వరద నీటిలో బంగారు ఆభరణాల బ్యాగు గల్లంతైంది. వర్షంలో వెళ్తున్న ఓ వ్యక్తి బ్యాగు నీటిలో పడిపోవడంతో ఆ బ్యాగ్… వ‌ర‌ద నీటిలో కొట్టుకు పోయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న‌ ఈ ఘటన ఆలస్యంగా బ‌య‌ట‌ప‌డింది. వివరాల్లోకెళితే బషీర్ బాగ్ వీఎస్ గోల్డ్ షాపు నిర్వాహకులు.. జూబ్లీహిల్స్ లోని కృష్ణ పెరల్స్ ఆభరణాల షాపు లో ఓ కస్టమర్ కోసం త‌మ సేల్స్‌మెన్‌ ప్రదీప్‌కు కిలోన్నర బంగారు ఆభరణాలను ఇచ్చి శనివారం ఉదయం పంపారు. కస్టమర్ కొన్ని న‌గ‌ల కొన్న తరువాత అదే రోజు సాయంత్రం సేల్స్ మెన్ ప్రదీప్ మళ్లీ ఆ న‌గ‌ల సంచి తీసుకుని బైకుపై బంజారాహిల్స్‌  మీదుగా బషీర్ బాగ్ కు వర్షంలోనే బయల్దేరాడు.

బంజారాహిల్స్ లో రోడ్డుపై వరదనీటిని దాటే క్రమంలో అత‌ని బైక్ అదుపుత‌ప్పి కాళ్ల మధ్యలో పెట్టుకున్న ఆభరణాల సంచి కిందపడి ప్రవాహంలో కొట్టుకుపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత దీనిని గుర్తించిన ప్రదీప్ వెనక్కి వచ్చి చూడగా బ్యాగు కనిపించలేదు. ఈ విషయం సేల్స్ మెన్ దుకాణ యజమానికి వెంటనే తెల్పడంతో దుకాణ యజమాని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్ ను విచారిస్తున్నారు. ప్రదీప్ పడిపోయిన దగ్గర పోలీసులు వెతకగా ఆ వరద నీటిలో కొట్టుకుపోయిన బ్యాగు.. పక్క బిల్డింగ్లో ఉన్న చెత్త బుట్ట వద్ద దొరికింది..కానీ దాంట్లో బంగారు ఆభరణాలు మాత్రం లేవు. ఆ బ్యాగ్ లో ఉన్న బంగారు ఆభరణాలు ఎవరు తీసుకెళ్లారని అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.