బాలుడి హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు.. ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జిమెంట్

బాలుడి హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు..   ప్రిన్సిపల్  అండ్  సెషన్స్  కోర్టు జడ్జిమెంట్

తిర్యాణి, వెలుగు: కుమ్రంభీమ్​ ఆసిఫాబాద్​ జిల్లా తిర్యాణి మండలంలోని ఉలిపిట్ట గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి దుర్గం ఉదయ్  కిరణ్  హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రిన్సిపల్  అండ్  సెషన్స్  కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్  గురువారం తీర్పు చెప్పినట్లు ఎస్పీ నితికా పంత్  తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. 

ఉల్లిపిట్ట గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన బోర్కుంట తరుణ్​ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసేవాడు. ఈక్రమంలో తన కూతురిని ఇబ్బంది పెట్టవద్దని ఆమె తల్లి అరుణబాయి సూచించింది. తన ప్రేమను నిరాకరిస్తుందనే కోపంతో ఉన్న తరుణ్​ 2023 జూన్​ ఒకటిన దుర్గం నరుణ్​కుమార్​తో కలిసి వారి ఇంటికి వెళ్లాడు. 

తల్లితో కలిసి యువతి ఉపాధి పనులకు వెళ్లగా, పడుకొని ఉన్న యువతి తమ్ముడిని ఇద్దరు కలిసి గొంతు నొక్కి చంపేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా, పీపీ జగన్మోహన్‌రావు కోర్టులో సాక్షులను ప్రవేశ పెట్టగా నేరం రుజువైంది. తరుణ్‌కు రూ.28 వేలు, నరుణ్‌కుమార్‌ కు రూ.26 వేల చొప్పున జరిమానా, ఇద్దరికి జీవిత ఖైదు విధించారు.