మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిన బాలుడిని రక్షించిన ఆర్మీ

మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిన బాలుడిని రక్షించిన ఆర్మీ

గుజరాత్ : బోరు బావిలో పడి చిన్నారులు మృతిచెందిన సంఘటనలు ఇప్పటి వరకూ మనం ఎన్నో చూశాం. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పిల్లలు బోరుబావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. బోరు బావిలో పడిన చిన్నారులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు చాలా చోట్ల విఫలమయ్యాయి. అతి తక్కువ శాతం మంది మాత్రమే ప్రాణాలతో బయటపడి మృత్యుంజయులుగా నిలిచారు. ఇలాంటి ఘటనే ఒకటి గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. బోరుబావిలో పడిన రేండేళ్ల బాలుడిని భారత ఆర్మీ అధికారులు ప్రాణాలతో బయటకు తీసి, కాపాడారు. గుజరాత్ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లా ధృంగధర తాలూకాలో దుధ్ పూర్ లో జరిగింది ఈ ఘటన. 

శివం అనే రేండేళ్ల బాలుడు తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ దుదాపూర్ గ్రామంలో ఉంటున్నారు. బాలుడు శివం ఆడుకుంటూ పొలంలో 300 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిపోయాడు. రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే గుర్తించిన తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇటు సమాచారం అందుకున్న జిల్లా పరిపాలన అధికారులు స్థానిక డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెల్ తో పాటు అహ్మదాబాద్ లోని జాతీయ 
విపత్తు ప్రతి స్పందన దళానికి చెందిన బృందాన్ని అప్రమత్తం చేశారు. ఆర్మీ, పోలీసులు, జిల్లా పరిపాలన సిబ్బంది, గ్రామస్తులతో కూడిన బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. 300 అడుగులు ఉన్న బోరు బావిలో బాలుడు శివం 25 అడుగుల లోతులో చిక్కుకుపోయినట్లు ఆర్మీ క్విక్ రియాక్షన్ టీమ్ గుర్తించింది. చిన్నారి ముక్కు వరకు నీరు చేరిందని, అతడు ఊపిరి పీల్చుకుంటుండడంతో పాటు అరుపులు వినిపించాయి. దీంతో వెంటనే రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ ప్రారంభించింది. 

కెప్టెన్ సౌరవ్ ఆధ్వర్యంలో ఆర్మీ మెటాలిక్ హుక్ ను తగిలించిన ఓ తాడును బోరు బావిలోకి పంపించారు. నిమిషం వ్యవధిలోనే మెటాలిక్ హుక్ బాబు టీషర్టుకు తగిలింది. వెంటనే బోరు బావి నుంచి బాలుడిని నెమ్మదిగా పైకి లాగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే బాలుడిని వైద్య పరీక్షల కోసం సురేంద్రనగర్ లోని ఆస్పత్రికి తరలించారు. శివం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలియజేశారు. బాలుడిని ప్రాణాలతో కాపాడిన భారత ఆర్మీ జవాన్లను, రెస్క్యూ సిబ్బందిని స్థానికులతో పాటు ఉన్నతాధికారులు అభినందించారు. అందరూ సమన్వయంతో పని చేసి రాత్రి 10 :45 గంటలకు బాలుడిని బోరుబావిలో నుంచి ప్రాణాలతో కాపాడారు. పోలీసులు, ఆర్మీ, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత 40 నిమిషాల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయినట్లు ధృంగాంధ్ర పరిపాలన అధికారి ఎంపీ పటేల్ పేర్కొన్నారు. 

రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోను పీఆర్వో డిఫెన్స్ గుజరాత్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. కొద్ది సమయంలో ఈ వీడియో వైరల్ అయ్యింది. రెస్క్యూ చేసిన ఆర్మీని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.