మహిళలపైకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి

మహిళలపైకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి
  •     నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో ఘటన

మాక్లూర్, వెలుగు : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు స్పాట్​లోనే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మాక్లూర్ సమీపంలోని దాస్​నగర్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే స్కూల్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. బోధన్ మండలంలోని చిన్న మావంది గ్రామానికి చెందిన పద్మ.. మహాత్మా జ్యోతిబా ఫూలే స్కూల్​లో ఎనిమిదో తరగతి చదువుతున్న తన 13 ఏండ్ల కూతురు ఈశ్వరిని కలిసేందుకు వచ్చింది. స్కూల్ దగ్గరే ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఈశ్వరీని తిరిగి స్కూల్​లో దిగబెట్టేందుకు నడుచుకుంటూ వెళ్తున్నది. 

అలాగే, ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లికి చెందిన కొత్తూర్ పోశవ్వ.. తన మనవరాలు హారికను చూసేందుకు కూతురు నీలతో కలిసి స్కూల్​కు వచ్చింది. వీళ్లు కూడా బయటే భోజనం చేశారు. హారికను తిరిగి స్కూల్​లో దించేందుకు పోశవ్వ, నీల రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో మాక్లూర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న టీఎస్‌‌ 16 ఈఎక్స్‌‌ 1234 నంబర్ కారు.. ఈ రెండు ఫ్యామిలీలను వేగంగా వచ్చి ఢీకొట్టింది. తర్వాత చెట్టును గుద్దుకుని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో పద్మ (35),  పోశవ్వ (60) స్పాట్​లోనే చనిపోయారు. గాయపడిన ఈశ్వరి, హారిక, నీలను నిజామాబాద్​లోని హాస్పిటల్​కు తరలించారు. వీరిలో ఈశ్వరి పరిస్థితి విషమంగా ఉంది. హారిక, నీలకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్​కు చెందిన కారు డ్రైవర్ రవిని స్థానికులు పట్టుకుని చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.