సిగాచి ఫ్యాక్టరీ మేనేజ్‌‌‌‌మెంట్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. ప్రభుత్వానికి ఉన్నతాధికారుల కమిటీ రిపోర్టు

సిగాచి ఫ్యాక్టరీ మేనేజ్‌‌‌‌మెంట్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. ప్రభుత్వానికి ఉన్నతాధికారుల కమిటీ రిపోర్టు

 

  • పరిశ్రమ నిర్వహణ, భద్రతా ప్రమాణాల్లో యాజమాన్యం ఫెయిల్‌‌‌‌ 
  • కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు 
  • కార్మికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెల్లడి 
  • భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని పలు సిఫార్సులు 
  • త్వరలోనే నిపుణుల కమిటీ నివేదిక కూడా 
  • ఈ రెండింటిపై కేబినెట్‌‌‌‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఉన్నతాధికారుల కమిటీ తేల్చింది. ఫ్యాక్టరీ నిర్వహణ, భద్రతా ప్రమాణాలను పాటించడంలో మేనేజ్‌‌‌‌మెంట్ పూర్తిగా విఫలమైందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్టు అందజేసింది. సిగాచి ఫ్యాక్టరీలో కీలకమైన భద్రతా ప్రమాణాలను గాలికొదిలేశారని నివేదికలో కమిటీ పేర్కొంది. ‘‘పరిశ్రమలో అగ్నిమాపక వ్యవస్థలు సరిగాలేవు.  కార్మికులకు సరైన భద్రతా శిక్షణ ఇవ్వలేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్​  మార్గాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రమాదకర రసాయనాల నిల్వ, వాటి నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఫ్యాక్టరీలో పాతబడిన యంత్రాలను వినియోగిస్తున్నారు” అని పేర్కొన్నారు. 

“యంత్రాలకు సరైన నిర్వహణ చేపట్టకపోవడం కూడా ప్రమాద తీవ్రతను పెంచింది. ఫ్యాక్టరీలో రోజువారీ పర్యవేక్షణ పూర్తిస్థాయిలో కొరవడింది. ప్రమాదాలు జరగకుండా ముందే గుర్తించి, నివారించాల్సిన యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించింది. తనిఖీలు నామమాత్రంగా జరిగాయి. భద్రతా ఉల్లంఘనలను పట్టించుకోలేదు. కార్మికుల ఫిర్యాదులను కూడా యాజమాన్యం పెడచెవిన పెట్టింది” అని తెలిపింది. 

గతంలో ప్రమాదాలు జరిగినా.. 

సిగాచి ఫ్యాక్టరీలో పాత యంత్రాలను వినియోగిస్తున్నారని నివేదికలో కమిటీ పేర్కొంది. ‘‘1990లో సిగాచి ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ను స్థాపించారు. ఇది ఫార్మాసూటికల్ కంపెనీ. ఇందులో ట్యాబ్లెట్లు,  క్యాప్సూల్స్‌‌‌‌‌‌‌‌లో ఉపయోగించే ఎక్సిపియెంట్స్ తయారు చేస్తున్నారు. ఇక్కడ సుమారు 300 మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ప్రమాదం సంభవించిన యూనిట్‌‌‌‌‌‌‌‌లో పాత మెషినరీని ఉపయోగిస్తున్నారు. కార్మికులు దాని గురించి యాజమాన్యానికి ఎన్నోసార్లు హెచ్చరికలు చేసినా మార్పులు చేయలేదు . ఫ్యాక్టరీలో ఫైర్ అలారమ్స్, హీట్ సెన్సర్లు, ఆటోమేటిక్ షట్‌‌‌‌‌‌‌‌డౌన్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ వంటి భద్రతా సదుపాయాలు లేవు. తెలంగాణ ఫైర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్​ఓసీ) కూడా లేదు. ఫ్యాక్టరీ నిర్వహణ, పర్యవేక్షణలో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ పూర్తి వైఫల్యం కనిపిస్తున్నది” అని తెలిపింది. అనుభవం లేని కార్మికులతో పనులు చేయించడం, పాత రియాక్టర్లను కొనసాగించడం వంటి నిర్లక్ష్యాలు ఈ ప్రమాదానికి దారితీసినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. గతంలో కూడా ఇలాంటి చిన్న ప్రమాదాలు జరిగినా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఫ్యాక్టరీల డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చిన భద్రతా సూచనలను పట్టించుకోలేదని పేర్కొంది. 

త్వరలో ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌ కమిటీ రిపోర్టు.. 

భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఉన్నతాధికారుల కమిటీ పలు సిఫార్సులు చేసింది. అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయాలని సూచించింది. భద్రతా తనిఖీలను మరింత పటిష్టం చేయాలని, నిబంధనలు పాటించని పరిశ్రమలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు  అవసరమైతే వాటి కార్యకలాపాలను నిలిపివేయాలని సిఫార్సు చేసింది. కార్మికులకు మెరుగైన భద్రతా శిక్షణ, రక్షణ పరికరాలను తప్పనిసరి చేయాలని సూచించింది. మరోవైపు  సీఎస్ఐఆర్–ఐఐసీటీ చైర్మన్ బి.వెంకటేశ్వర రావు నేతృత్వంలో ప్రభుత్వం ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో టి.ప్రతాప్ కుమార్, సూర్యనారాయణ, సంతోష్ ఘుగే సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రమాదానికి కారణాలను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో అలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది. ఈ రెండు కమిటీల నివేదికలపై ప్రభుత్వం కేబినెట్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది.