పెండ్లి కార్డు పంపిన జంట.. బెస్ట్ విషెస్ చెప్పిన ఆర్మీ..

పెండ్లి కార్డు పంపిన జంట.. బెస్ట్ విషెస్ చెప్పిన ఆర్మీ..

మనం బయట స్వేచ్ఛగా తిరగుతున్నామంటే, కంటినిండా ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే, ఇంట్లో ఆనందంగా పండుగలు, వేడుకలు జురుపుకుంటున్నామంటే కారణం మన దేశ సైనికులే. కుటుంబాన్ని, ఆనందాలను దూరం చేసుకుంటూ, సరైన నిద్ర, ఆహారం లేకపోయినా కష్టమైన వాతావరణ పరిస్థితుల్ని ఎదురుకుంటూ సరిహద్దుల దగ్గర దేశ రక్షణ కోసం కాపలా కాస్తుంటారు. వాళ్ల త్యాగాలకు మనం ఏం చేసినా తక్కువే. అందుకే సైనికుల్ని కుటుంబ సభ్యులుగా భావిస్తూ, కేరళలోని ఓ జంట వాళ్ల పెండ్లికి ఇండియన్ ఆర్మీని ఆహ్వానించింది. నవంబర్ 10న వివాహం జరగగా.. ఆ జంట పంపిన పెండ్లి కార్డు, దానికి ఆర్మీ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాహుల్, కార్తీక ఈ నెల 10న వివాహ బంధంతో ఒకటయ్యారు. వాళ్ల పెండ్లి వేడుకకు సైనికులను ఆహ్వానిస్తూ ‘ప్రియమైన హీరోలారా.. మేము వివాహం బంధంతో ఒక్కటవ్వబోతున్నాం. మీరు దేశం కోసం చూపిస్తున్న ప్రేమ, సంకల్పం, ధైర్యం, త్యాగం, దేశభక్తికి ధన్యవాదాలు. సరిహద్దుల్లో పహారా కాస్తూ మమ్మల్ని సురక్షితంగా ఉంచుతున్నందుకు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. మీ వల్లే మేము ప్రశాంతంగా నిద్రపోతున్నాం. మా కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా జీవించగలుగుతున్నాం. ఇప్పుడు మీ కారణంగానే సంతోషంగా వివాహం చేసుకుంటున్నాం. ఈ  ప్రత్యేక రోజున మమ్మల్ని ఆశీర్వదించడానికి మీ అందర్ని ఆహ్వానిస్తున్నాం’ అని రాసి ప్రత్యేక వెడ్డింగ్ కార్డు పంపారు.

తాజాగా ఆ ఆహ్వానాన్ని భారత సైన్యం తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రాంలో ఫొటోను షేర్ చేస్తూ, ‘బెస్ట్ విషెస్ ఫ్రమ్ #ఇండియన్ ఆర్మీ. మీ ఈ ఆహ్వానానికి హృదయపూర్వక ధన్యవాదాలు. రాహుల్, కార్తీక ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని పోస్ట్ చేశారు.