మంత్రిపై అట్రాసిటీ కేసు పెట్టేందుకు పీఎస్ కు వెళ్లిన దళిత మహిళ 

మంత్రిపై అట్రాసిటీ కేసు పెట్టేందుకు పీఎస్ కు వెళ్లిన దళిత మహిళ 

నిర్మల్ జిల్లా : నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ గ్రామం ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టేందుకు రాజవ్వ అనే దళిత మహిళ నర్సాపూర్- జీ గ్రామం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. దీంతో రాజవ్వ ఫిర్యాదును ఎస్ఐ గీత తిరస్కరించారని తెలుస్తోంది. బతుకమ్మ చీరల పంపిణీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..తనను తీవ్రంగా అవమానించారని రాజవ్వ ఆరోపిస్తోంది. దళితురాలైన తనను అవమానపర్చడమే కాకుండా.. భయభ్రాంతులకు గురి చేస్తూ.. కేసులు పెట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మంత్రిపై కేసు పెట్టేందుకు పోలీసులు స్పందించకపోవడంతో ఫిర్యాదు పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి అందజేసింది. కేసులతో తనను మానసికంగా కుంగదీస్తున్నారంటూ రాజవ్వ ఆరోపిస్తోంది. 

అసలేం జరిగింది..?
గత నెల 26వ తేదీన  బతుకమ్మ చీరల పంపిణీ కోసం నిర్మల్ జిల్లా నర్సాపూర్ -జీ గ్రామానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లారు. ఆ కార్యక్రమంలో రాజవ్వ మంత్రికి ఫిర్యాదు చేశారు. దళితబంధు తమకు రావడం లేదని, ఎంపిక విషయంలోనూ పారదర్శకత లేదని చెప్పింది. దీంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాకు ఇష్టం వచ్చిన వాళ్లకు దళిత బంధు ఇస్తాం. వచ్చే వరకు ఓపిక లేకుంటే ఏం చేయలేం’ అంటూ కామెంట్స్ చేశారు. 

‘ఇచ్చింది ఎక్కువైతే ఇలాగే ఉంటది.. ఒక్కసారిగా 10 లక్షలు ఇస్తే ఏం చేస్తావో చూపెట్టు’ అని మహిళను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిలదీశారు. దళిత బంధు అర్హులకు రాలేదని అడిగిన మహిళను బయటకు వెళ్లిపొమ్మని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దళిత బంధుతో కార్లు, ట్రాక్టర్లు కొంటే అవి అన్నం పెడుతాయా..? రూ.10 లక్షలతో ఏం చేసి బతుకుతారు..? మీకు ఏం అనుభవం ఉంది. చెబితేనే దళిత బంధు ఇస్తాం. దళిత బంధు మీకు మేమియ్యం. కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ల నుండే తీసుకోండి. బీజేపీ వాళ్లతో తిరుగుతున్నారు కదా. వాళ్ల దగ్గరి నుండి దళిత బంధు తెచ్చుకోండి’ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీరియస్ అయ్యారు.

ఐదుగురు దళితులపై కేసులు 
మరోవైపు నర్సాపూర్ జీ గ్రామంలో ఐదుగురు దళితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అలేఖ్య అనే టీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఐదుగురు దళితులపై కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక విషయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నర్సాపూర్ జీ గ్రామస్తులపై ఘాటు వ్యాఖ్యలు చేశారని, దళితబంధు అడిగితే కేసులు నమోదు చేయించారని బాధితులు వాపోయారు. ప్రస్తుతం ఈ ఇష్యూ జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.