కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ఒక రోజే మిగిలి ఉండగా, సోమవారం కురిసిన వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. దక్షిణ బెంగళూరులోని హోసకెరెహళ్లి సరస్సు వెనక ఉన్న పుష్పగిరి లేఅవుట్ మునిగిపోయింది. బీబీఎంపీ మురుగు కాలువ విభాగం చేపట్టిన అసంపూర్తి పనులే భారీ వరదలకు దారి తీశాయి. కొన్ని నెలల క్రితమే లేఅవుట్‌కు సమీపంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలో వదిలేశాడు. దీంతో వర్షానికి ఆ ప్రాంతం మొత్తం వరదమయమైంది. తర్వాత అధికారులు వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. లేఅవుట్‌తో పాటు, దత్తాత్రేయ దేవాలయం వెనక ఉన్న రెండు ఇళ్లు, గిరినగర్‌లోని మరో ఇంట్లోకి వర్షపు నీరు చేరింది.
మరి కొన్ని ప్రాంతాల్లో..
లాల్‌బాగ్ సమీపంలోని కదిరేనహళ్లి మెయిన్ రోడ్డు , నమ్మ మెట్రో స్టేషన్ బయట నీరు నిలిచిపోయింది . శాంతినగర్‌లో చెట్టు కొమ్మ రోడ్డుపై పడటంతో ట్రాఫిక్ ఆగిపోయింది. బసవనగుడిలోని శ్రీనివాసనగర్‌లో చెట్టు కూలింది.