రసవత్తరంగా తెలుగు బిగ్ బాస్ షో

రసవత్తరంగా తెలుగు బిగ్ బాస్ షో

కదిలిస్తే కోపాలు.. కాదంటే కన్నీళ్లు.. అడుగేస్తే అరుపులు.. చిటికేస్తే చిరాకులు.. ఇదీ తెలుగు బిగ్‌బాస్‌ హౌస్ లోని పరిస్థితి. ప్రతిసారీ మొదటి వీకెండ్ ఎపిసోడ్‌కి ఏం చెప్పాలో తెలియక సరదా టాస్క్ లు పెట్టి గడిపేసేవారు నాగార్జున. కానీ, ఈసారి కంటెస్టెంట్లు మొదటివారమే కావాల్సినంత మసాలా నూరడంతో వీకెండ్ ఎపిసోడ్‌కి ఫుల్లుగా ఫుటేజ్ దొరికేసింది. లేటెస్ట్ ఎపిసోడ్‌ కూడా బోలెడన్ని టాఫిక్స్ రెయిజ్ చేసింది. ముందు అనుకున్నట్టే మస్తుగా ఎంటర్‌‌టైన్ చేసింది.

మొదటి కెప్టెన్ ఎవరో..!
కెప్టెన్ ఎంపిక కోసం బిగ్ బాస్ హౌజ్ లో డిస్కషన్ జరిగింది. అందరూ తమ తమ అభిప్రాయాలను ఓపెన్‌గా చెప్పారు. బాలాదిత్య, రేవంత్, సుదీప పేర్లు చెప్పాడు శ్రీహాన్. రేవంత్ వచ్చి బాలాదిత్య, సూర్యతో పాటు మెరీనా, రోహిత్‌లకు ఓటేశాడు. వాసంతి, షానీ సల్మాన్ సూర్య పేరు చెప్పారు. ఎక్కువమంది అయితే బాలాదిత్య వైపే మొగ్గు చూపారు. అతను మెచ్యూర్డ్గా, బ్యాలెన్స్డ్‌గా ఉంటాడంటూ కితాబిచ్చారు. చివరికి బాలాదిత్యతో పాటు సూర్య, మెరీనా–రోహిత్‌లు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. మరి వీరిలో మొదటి కెప్టెన్ ఎవరవుతారో చూడాలి. 

తగ్గేదే లే..!
ఎవరు ఏం చేప్పినా మేము వినం, మేం చెప్పేది మాత్రం అందరూ వినాలి అనే యాటిట్యూడ్‌తో ఉన్న కొందరు కంటెస్టెంట్ల వల్ల తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఈ లిస్టులో మొదట ఉన్నది గీతూ. మంచిగా మాట్లాడటమే చేతకాని గీతూ ఎలా మాట్లాడాలి అంటూ అందరికీ క్లాసులు తీసుకుంటోంది. చంటికి కూడా ఏదో చెప్పే ప్రయత్నం చేయడంతో అతను రివర్స్ అయ్యాడు. ఎవరైనా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి.. నాకు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసంటూ ఇన్‌డైరెక్ట్ గా చురకలంటించాడు. అమ్మ బాగుందా అనడానికీ నీ అమ్మ బాగుందా అనడానికీ చాలా తేడా ఉందంటూ బాలయ్య స్టైల్లో బదులిచ్చాడు. కానీ, గీతూ వినే టైపు కాదు కదా. ఇంకా ఏదో మాట్లాడాలని ట్రై చేసింది. నీ పాయింట్ నీదే తప్ప ఎవరు చెప్పేదీ నువ్వు వినవు అని చంటి అనడంతో అలిగింది. నాకు మైండ్ వాయిస్ లేదు ముఖమ్మీదే చెప్పేస్తా అంటూ కెమెరాలతో మొరపెట్టుకుంటోంది. కెప్టెన్సీ విషయమై చర్చ జరుగుతున్నప్పుడు బాలాదిత్య మాట్లాడుతుంటే కూడా లేచి వెళ్లిపోయి రుసరుసలాడుతూ ఏదేదో మాట్లాడేసింది గీతూ. తనే తగ్గి ఆమెని పిలిచి మాట్లాడమన్నాడు బాలాదిత్య. అప్పుడు వచ్చి కూడా తన స్టైల్లో చెప్పడం మొదలెట్టిందామె. రేవంత్ ఏదో చెప్పబోతే చాలా హార్ష్ గా మాట్లాడింది. అయితే నేను పోతాను అంటే పోతే పో అంది. పైగా తర్వాత దీని గురించి డిస్కషన్ పెట్టింది. రేవంత్ ఇంట్లోంచి ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిదని, లేదంటే అంత పెద్ద సింగర్ ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి అని అందరూ తప్పుగా అనుకుంటారని జడ్జ్ చేసింది. తన మాటతీరుతో ముందు ముందు ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తుందో మరి.

ఇక ఈ విషయంలో గీతూ అంత కాకపోయినా ఇయనా కూడా తగ్గట్లేదు. ఎవరేం అన్నా దాని అటు లాగి ఇటు లాగి ఇష్యూ చేసుకుంటోంది. మీరు తెల్లగా, అందంగా ఉంటారు అని నన్నొకరు అన్నారు అంటూ ఓ సందర్భంలో ఉదాహరణగా చెబుతున్నాడు బాలాదిత్య. అక్కడ తన పేరు ఎత్తకపోయినా అది నేనే అంటూ బయటపెట్టుకుందామె. పైగా ఆ తర్వాత అతనితో వాదనకు దిగింది. మీరలా అందరి ముందూ చెప్పడం నాకు నచ్చలేదు అంటూ చర్చ మొదలెట్టింది. నేను చెప్పిన ఉద్దేశం వేరు అంటూ అతను చెబుతున్నా వినకుండా నేను గొడవకు రెడీ అంటూ మాట్లాడింది. మిస్టర్‌‌ కూల్‌ బాలాదిత్య మాత్రం ‘నేను గొడవలకి రెడీ కాదు చెల్లీ’ అంటూ తనదైన స్టైల్‌లో కౌంటర్‌‌ ఇచ్చాడు. అతనిలోని ఈ మెచ్యూరిటీయే కెప్టెన్సీ పోటీకి మ్యాగ్జిమమ్ సభ్యులు అతని పేరు సూచించేలా చేసిందనడంలో సందేహమే లేదసలు.

ఇక వీళ్లిద్దరి తర్వాత అలకలు, కోపాల ప్రహసనంలో ముందడుగు వేస్తున్న కంటెస్టెంట్ మెరీనా. ఎంత తన భర్తతో కలిసి హౌస్‌కి వచ్చినా, ఇద్దరూ కలిపి ఒకే కంటెస్టింట్‌గా లెక్క పెడతాం అని బిగ్‌బాస్ చెప్పినా ఎవరి ఆట వాళ్లు ఆడాలనే విషయాన్ని ఆమె మర్చిపోతోంది. మాట్లాడితే నా భర్త, నాతో గడపాలి, నాకు టైమివ్వాలి అంటూ చైల్డిష్‌గా బిహేవ్ చేస్తోంది. తన పద్ధతి ఆమె భర్తకి చిరాకు తెప్పిస్తున్న విషయం క్లియర్‌‌గా అర్థమైపోతోంది. కానీ మెరీనా తగ్గట్లా. పైగా నేను తనతో మాట్లాడుతుంటే సత్య వచ్చి వాక్‌కి వెళ్దామంటోంది, తనెవరు చెప్పడానికి అంటూ తెగ చిర్రుబుర్రులాడింది. ఓ రౌండ్ ఏడ్చేసింది కూడా. హగ్ ఇవ్వట్లేదని, తన దగ్గరకు రావడం లేదని ఆమె చేసే కామెంట్లు ఇతర సభ్యులకే కాదు.. ప్రేక్షకులకి కూడా నెగిటివ్‌గా రీచ్ అయ్యే అవకాశం ఉందని మెరీనా గుర్తిస్తే మంచిదంటున్నారంతా. 

ఆరోహి ఆందోళన
తనకి రావాల్సినంత గుర్తింపు రావడం లేదని ఆరోహి ఆందోళన చెందుతోంది. హౌస్‌మేట్స్ తనని ఎంకరేజ్ చేయాలని బలవంతపెడుతున్నట్టే బిహేవ్ చేస్తోంది. చిన్న క్విజ్ ప్రోగ్రామ్‌ పెట్టాడు బిగ్‌బాస్. రెండు గ్రూపులుగా విడిపోవాలి. ఒక్కో గ్రూప్ నుంచి ఒక్కొకరు వచ్చి నిలబడాలి. సూర్య ప్రశ్న అడిగినప్పుడు ఎవరు ముందుగా బజర్ నొక్కుతారో ఆ టీమ్‌కి ఆన్సర్ చెప్పే చాన్స్ దొరుకుతుంది. ఆ గ్రూప్ నుంచి శ్రీ సత్య వచ్చింది. రెండో గ్రూప్ నుంచి రేవంత్ రెడీ అన్నాడు. కానీ ఆరోహి నేను వెళ్తానంటూ పట్టుబట్టింది. కాదంటే గొడవ పడింది. నాకు కాన్ఫిడెన్స్ లేకపోయినా మీరు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపించాలంటూ క్లాసు కూడా పీకింది. చివరికి పోటీలో తన గ్రూప్‌కి ఓటమిని మిగిల్చింది. తన ఇంటెలిజెన్స్ తో, టైమింగ్‌తో శ్రీసత్య అదరగొట్టింది. ఆ తర్వాత కూడా సూర్యతో రేవంత్ ఏదో మాట్లాడుతుంటే ఆరోహి మధ్యలోకి వచ్చి దెబ్బలాటకు దిగింది. అతను అనని మాట అన్నాడంటూ సీరియస్ అయిపోవడంతో రేవంత్ చిరాకు పడ్డాడు. తప్పుంటే పడతాను తప్ప నా తప్పు లేకపోతే పడను అని తేల్చి చెప్పాడు. దాంతో ఆరోహి ఏడ్చేసింది. తన భాషను బట్టి కొన్ని పదాలు వాడుతున్నానని, దాన్ని పట్టుకుని రేవంత్ తనను బాధ పెడుతున్నాడని చెప్పుకుని ఫీలైంది. 

పంచాయితీ విత్ ఫ్రస్ట్రేషన్
మొత్తానికి రేవంత్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లింది. ప్రతి ఒక్కరూ తనని తప్పుబట్టడం అతనిని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఆల్రెడీ బాలాదిత్య కూర్చోబెట్టి మంచి చెప్పే ప్రయత్నం చేశాడు. నువ్వు చెడ్డోడివి కాదు, కాస్త మాట తీరు మార్చుకుంటే సరిపోతుందని అతను చెప్పడంతో అది కరెక్టేనని ఒప్పుకున్నాడు రేవంత్. కెప్టెన్సీ గురించి చర్చల్లో గీతూ అతిగా మాట్లాడినా ఎందుకో కంట్రోల్ చేసుకున్నాడు. కానీ ఆరోహి రెచ్చగొట్టినప్పుడు మాత్రం అతను తట్టుకోలేకపోయాడు. వేలు చూపించి మాట్లాడితే ఊరుకునేది లేదని, నేను మరీ అంత తక్కువోడిని కాదు అని అన్నాడు. అందరూ తననే టార్గెట్ చేస్తున్నారని, ఒకవేళ నేను కరెక్ట్ కాదనుకుంటే వెళ్లిపోతానే తప్ప ఇవన్నీ పడనని బిగ్‌బాస్‌తో చెప్పాడు. సూర్యతో పంచాయితీ పెట్టి మరీ దీని గురించి డిస్కస్ చేశాడు. ఈ వారమంతా జరిగిన దానిలో తప్పు నాదే అయితే నేను ఈ వీకెండ్ ఎలిమినేట్ అయిపోతాను, అలా అవ్వకపోతే చుక్కలు చూపిస్తానంటూ చాలెంజ్ కూడా చేశాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆరోహి కూడా చిన్న చిన్న పంచాయితీలు పెట్టింది. చివరికి రేవంత్ దగ్గరకు వెళ్లి తన తప్పుకి సారీ చెప్పింది. తానో అనాథనని, ఒంటరిగా పెరిగానని, ఎవరినీ దూరం చేసుకోవడం ఇష్టం ఉండదని చెప్పింది. రేవంత్ పాజిటివ్‌గా రియాక్టయ్యాడు. నేనేం మనసులో పెట్టుకోలేదు వదిలేయమన్నాడు. అయితే గీతూ మధ్యలో దూరి నువ్వేం ప్రూవ్ చేసుకోనక్కర్లేదు అని ఆరోహికి చెప్పి పుల్లలు పెట్టే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత రేవంత్ మళ్లీ వెళ్లి మిగతావాళ్లతో ఈ విషయం గురించి మాట్లాడాడు. ఎవరూ ఎవరినీ పీకేది లేదు అనడంతో ఆదిరెడ్డి ఖండించాడు. దాంతో మరోసారి రేవంత్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లింది. ఇద్దరికీ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇదే అదనుగా గీతూ మరోసారి తన పెద్దరికాన్ని ప్రదర్శించే ప్రయత్నం మొదలుపెట్టింది. 

మొత్తంగా ఎపిసోడ్ అంతా గొడవలు, కొట్లాటలతో సాగింది. చివరలో రేవంత్‌కి మరోసారి మంచి చెప్పే ప్రయత్నం మొదలెట్టాడు బాలాదిత్య. మరి అతని మాటలు ప్రభావం చూపిస్తాయా..? రేవంత్‌ కోపం చల్లారుతుందా..? ఆరోహి ఆవేశానికి ఎవరైనా హాల్ట్ వేస్తారా..? గీతూ గలాటాకి బ్రేక్ పడుతుందా లేదా చూడాల్సిందే.