ఇక స్మార్ట్ గా స్త్రీనిధి రుణాలు ..టెక్నాలజీతో రుణాల పంపిణీ సులభతరం

ఇక స్మార్ట్ గా స్త్రీనిధి రుణాలు ..టెక్నాలజీతో రుణాల పంపిణీ సులభతరం
  • అక్రమాలకు చెక్ పెట్టేందుకు యాప్​ రూపకల్పన
  • యాప్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకునే చాన్స్
  • ‘మన స్త్రీనిధి’ యాప్​లో సకల సమాచారం

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు :  మహిళా పొదుపు సంఘాల కోసం ప్రభుత్వం తాజాగా 'మన స్త్రీనిధి' యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పాత రుణాల వాయిదాలను పర్యవేక్షించడమే కాకుండా.. కొత్తగా రుణం కావాలనుకునే వారు కూడా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. సభ్యులు తాము చెల్లించిన సొమ్ము సక్రమంగా జమ అయిందో.. లేదో ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారానే సరిచూసుకోవచ్చు. దీనివల్ల నిధుల మళ్లింపు, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.‘మన స్ర్తీనిధి’ యాప్​తో రుణాల పంపిణీ సులభతరం అవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

రూ.5 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు..

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను స్వయం ఉపాధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు రూ.5 వేల నుంచి 5 లక్షల వరకు రుణాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. ఆరోగ్య, విద్య అవసరాల కోసం స్ర్తీనిధి ద్వారా రుణాలు ఇస్తున్నారు. వ్యవసాయ అనుబంధ, పరిశ్రమ అనుబంధ రంగాలతో జీవనోపాధి పొందేందుకు రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నారు. జయశంకర్​భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 8,335 డ్వాక్రా సంఘాలు ఉండగా, 8,6069 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది స్ర్తీనిధి ద్వారా రూ. 18 కోట్ల రుణాలను పంపణీ చేశారు. 

అక్రమాలకు చెక్ పెట్టేలా యాప్​..

డ్వాక్రా సంఘాల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తాజాగా స్ర్తీనిధి యాప్​ను తీసుకొచ్చింది. ఈ యాప్​ ద్వారా రుణ వాయిదాలు ఖాతాల్లో లీడర్లు జమ చేస్తున్నారా.. లేదా.. అనేది సులువుగా పరిశీలించవచ్చు. గతంలో అప్పు తీసుకున్న వారు కడుతున్నారో.. లేదో తెలిసేది కాదు. కానీ ఈ యాప్​లో సభ్యులు తీసుకున్న రుణాల వివరాలు నమోదై ఉంటాయి. 

సంఘం నుంచి ఏ సభ్యుడు ఎంత రుణం తీసుకున్నాడు. చెల్లించాల్సిన వాయిదాలెన్ని ? ఇంకా బకాయిలెన్ని ఉన్నాయనేది పొందుపరుస్తారు. రుణాల చెల్లింపులకు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన పని లేకుండా ఇంటి నుంచి చెల్లింపులు చేసే అవకాశం కల్పించారు. కొందరు లీడర్లు స్ర్తీనిధి వాయిదాల సొమ్మును సభ్యులకు తెలియకుండా వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసుకుంటున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఇలాంటి అక్రమాలకు ఇతర మోసాలను యాప్​లో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.

రుణాలు పొందేందుకు చాన్స్..

స్ర్తీనిధి రుణాలు పొందేందుకు గతంలో సంఘం మీటింగ్ ఏర్పాటు చేసుకుని వీవోలు తీర్మానం చేసి రుణాలు కేటాయించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.. నేరుగా ఫోన్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకునే చాన్స్ కల్పించారు. సంఘం నుంచి యాప్​లో వచ్చిన దరఖాస్తులను చూసి వీవోఏలు ఫైల్ రన్ చేసేలా ప్లాన్ చేశారు. 

రుణాల పంపిణీ సులభతరం 

ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘మన స్ర్తీనిధి’ యాప్​ద్వారా రుణాల పంపిణీ సులభతరమైంది. స్ర్తీనిధి రుణాల బకాయిలు ఉన్నవారు మొత్తంగా చెల్లించారు. ఒక్క సంఘం చేత వీవోఏ డిఫాల్టర్ గా ఉంటుంది. పాత రుణాల వివరాలు కూడా యాప్​లో కనబడతాయి. యాప్​తో రుణాల చెల్లింపులో ఎలాంటి మోసాలుండవు. సంఘాల్లో పారదర్శకత పెరుగుతోంది. - జె.రమాకాంత్, స్ర్తీనిధి ఆర్ఎం