ధర్మాధికారి రిపోర్టు అమలు చేయాల్సిందే

ధర్మాధికారి రిపోర్టు అమలు చేయాల్సిందే

కరెంటు ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు తీర్పు

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య కరెంటు ఉద్యోగుల విభజనలో ధర్మాధికారి రిపోర్టును అమలు చేసి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ధర్మాధికారి కమిటీ సూచించిన మేరకు ఉద్యోగులను తీసుకోవాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌‌ అశోక్‌‌ భూషణ్‌‌, జస్టిస్‌‌ ఎంఆర్‌‌ షాల డివిజన్​ బెంచ్​ సోమవారం తీర్పు వెలువరించింది. దీంతో ఏపీ స్థానికత కారణం చూపుతూ తెలంగాణ కరెంటు సంస్థలు రిలీవ్​ చేసిన ఉద్యోగులను, దానికి సంబంధం లేని వారిని కూడా తెలంగాణ చేర్చుకోవాల్సి రానుంది. దీనిపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. తెలంగాణ వచ్చినా ఇంకా ఆంధ్రోళ్ల పెత్తనమేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రిపోర్టును సవరించి..

ధర్మాధికారి కమిటీ ఇరు రాష్ట్రాల విద్యుత్‌‌ సంస్థలు, ఉద్యోగులతో పలుమార్లు సమావేశమై.. 2019 డిసెంబర్​ 26న రిపోర్టు ఇచ్చింది. రిలీవైన ఎంప్లాయీస్​ ఇచ్చిన ఆప్షన్ల మేరకు ఏపీకి 655 మందిని, తెలంగాణకు 502 మందితోపాటు ఆప్షన్‌‌ ఇవ్వని 71 మందిని కూడా కేటాయించింది. అయితే ఏపీకి 655 మందిని కేటాయించాలన్న సిఫార్సును ఏపీ కరెంటు సంస్థలు తప్పుపట్టాయి. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో రిపోర్టులో సవరణలు చేయాలని ధర్మాధికారి కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పరిశీలన జరిపిన కమిటీ.. మరో 584 మంది ఏపీ స్థానికత ఉన్న ఎంప్లాయీస్​ను తెలంగాణకు కేటాయిస్తూ ఈ ఏడాది జూన్‌‌ 20న తుది రిపోర్టు ఇచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ సంస్థలు సుప్రీం కోర్టులో పిటిషన్​ వేశాయి.

గైడ్​లైన్స్​కు విరుద్ధమని వాదించినా..

జస్టిస్‌‌ ధర్మాధికారి కమిటీ తుది రిపోర్టు గైడ్​లైన్స్​కు విరుద్దమని తెలంగాణ కరెంటు సంస్థలు వాదించాయి. కమిటీ ఆదేశాల మేరకు.. అప్పటికే తెలంగాణకు ఆప్షన్​ ఇచ్చిన 502 మందిని, హెల్త్‌‌, స్పౌజ్‌‌ ఆప్షన్‌‌  కింద మరో 71 మందిని తీసుకున్నట్టు తెలిపాయి. అంతేగాకుండా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఎంప్లాయీస్​ మరో 242 మందిని కూడా చేర్చుకున్నట్టు వెల్లడించాయి. ఇలాంటిది ఫైనల్​ రిపోర్టులో మరో 584 మందిని తీసుకోవాలనడం సరికాదని పేర్కొన్నాయి. కానీ ఈ వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

తెలంగాణ సంస్థలకు రూ.8 వేల కోట్లు నష్టం

కోర్టు ఆదేశాల మేరకు.. ఏపీ స్థానికత ఉన్న ఎంప్లాయీస్​కు తెలంగాణ కరెంటు సంస్థలు ఐదున్నరేండ్లుగా జీతాలు ఇస్తున్నాయి. అయితే వారికి డ్యూటీ ఏమీ అప్పగించకుండా కేవలం అటెండెన్స్​ తీసుకుని శాలరీ చెల్లించారు. ఇందుకు ప్రతినెలా రూ.18 కోట్ల చొప్పున రూ.1,650 కోట్లు ఇచ్చారు. దీనితోపాటు ధర్మాధికారి కమిటీ కోసం, కోర్టుల చుట్టూ తిరగడానికి, లాయర్ల ఫీజులకు ఖర్చు పెట్టారు. ఇదంతా పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఎక్స్​పర్టులు, కరెంటు శాఖ అధికారులే అంటున్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నా వారితో పని చేయించుకోలేదని.. ఈ ఐదున్నరేళ్లలో వారి సేవల విలువ లెక్కిస్తే ఐదారు వేల కోట్లు నష్టపోయినట్టేనని స్పష్టం చేస్తున్నారు.

ఐదేండ్లుగా ప్రమోషన్లు లెవ్వు

రాష్ట్ర సర్కారు ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా కరెంటు సంస్థల్లోని ఏపీ ఉద్యోగులను రిలీవ్​ చేసిందని కరెంటు డిపార్ట్​మెంట్​ వర్గాలు మండిపడుతున్నాయి. దీనివల్ల సాధించిందేమీ లేదని.. ఈ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో వేల మంది ఉద్యోగులు ప్రమోషన్లు అందుకోలేకపోయారని పేర్కొంటున్నాయి. ఐదేండ్లుగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు నిలిపేయడంతో తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిందని స్పష్టం చేస్తున్నాయి. చాలా మంది ఉన్న తాధికారులు కూడా ప్రమోషన్లు లేకుండా రిటైరయ్యారని చెప్తున్నాయి.

ఐదున్నరేండ్లుగా వివాదం

రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో తెలంగాణ, ఏపీ మధ్య కరెంటు ఉద్యోగుల పంపకంపై వివాదం తలెత్తింది. తెలంగాణ కరెంటు సంస్థలు ఏపీ స్థానికత ఉన్న 1,274 మంది ఉద్యోగులను 2015 జూన్‌‌ 10న  రిలీవ్​ చేసి.. ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిందిగా సూచించాయి. కానీ ఏపీ ప్రభుత్వం వారిని తీసుకోవడానికి నిరాకరించింది. అటూ ఇటూ కాకుండా పోవడంతో 1,157 మంది ఎంప్లాయీస్​ హైకోర్టును ఆశ్రయించారు. దానిపై స్పందించిన హైకోర్టు.. ఈ వివాదం తేలేంత వరకు రిలీవైన ఎంప్లాయీస్​కు తెలంగాణ సంస్థలే జీతాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ సంస్థలు రిలీవైన ఎంప్లాయీస్​కు జీతాలు ఇచ్చినా.. డ్యూటీలు మాత్రం వెయ్యకుండా ఖాళీగానే ఉంచేశాయి. దీంతో ఏపీ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్‌‌ ధర్మాధికారితో సింగిల్​ మెంబర్​ కమిటీని ఏర్పాటు చేసింది.