తాగి కారు నడిపి.. కూరగాయల బండిని ఢీకొట్టిన ఇన్​స్పెక్టర్

తాగి కారు నడిపి..  కూరగాయల బండిని ఢీకొట్టిన ఇన్​స్పెక్టర్
  •  రెండు కాళ్లు విరిగి వ్యక్తికి తీవ్రగాయాలు
  •  కేసు నమోదు చేసిన పోలీసులు 

సికింద్రాబాద్, వెలుగు: తాగి కారు నడిపిన ఓ ఇన్​స్పెక్టర్ కూరగాయల బండిని ఢీకొట్టాడు. అందులో ఉన్న వ్యక్తి రెండు కాళ్లు విరిగాయి. ఈ ఘటన బొల్లారం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఆర్ నగర్​కు చెందిన శ్రీనివాస్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్​లో ఇన్స్పెక్టర్​గా పనిచేస్తున్నాడు. డీఎస్పీ పదోన్నతి లిస్టులో ఉన్నాడు. శామీర్​పేటలో ఉంటున్న అతడి తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉండగా..  శ్రీనివాస్ అక్కడికి వెళ్లాడు.  శనివారం శామీర్​పేట నుంచి సికింద్రాబాద్ ​మీదుగా ఎస్ఆర్​నగర్​కు బయలుదేరాడు. 

ఉదయం 7.30 గంటలకు బొల్లారంలోని హకీంపేట వై జంక్షన్ వద్ద కూరగాయలు నింపుకుని వెళ్తున్న టాటా ఏస్ వెహికల్​ను ఢీకొట్టాడు.  కూరగాయల బండిలో ఉన్న అంజయ్యనగర్​కు చెందిన శ్రీధర్ రెండు కాళ్లు విరగడంతో అతడిని హాస్పిటల్​కు తరలించారు. శ్రీనివాస్​కు బ్రీత్ అనలైజర్ టెస్టు చేయగా బీఏసీ లెవెల్ 250 పాయింట్లు వచ్చిందని పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ చేశామన్నారు. పదేండ్ల కిందట మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ కూతురు చనిపోయింది. తల్లిదండ్రులు సైతం అనారోగ్యం బారిన పడటంతో ఆయన మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది.