
సినిమా అంటే కేవలం కథ, నటీనటులు మాత్రమే కాదు. దానికి తగ్గ భారీతనం కూడా అవసరం. దీనిని నిరూపిస్తూ నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా 'ది పారడైజ్' కోసం మూవీ మేకర్స్ ఒక వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. సినీ చరిత్రలోనే అతిపెద్ద సెట్ ను నిర్మిస్తున్నారు. ఇది అత్యంత ప్రత్యేకమైన సెట్‌లలో ఒకటిగా నిలిచిపోయేలా రూపొందిస్తున్నారు. దీని కోసం హైదరాబాద్ శివార్లలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ మురికివాడ సెట్‌ను నిర్మిస్తున్నారు. దీనిని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలు 'స్లమ్స్‌కు బాహుబలి' అంటూ పోలుస్తున్నాయి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న 'ది పారడైజ్' సినిమాపై నాని అభిమానులు భారీగానే అంచనాలు పెట్టకున్నారు. 'దసరా' మూవీతో తన సత్తా చాటిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన విజువల్స్ తో కూడిన సినిమాగా రూపుదిద్దుకుంటుంది. 'బాహుబలి' సినిమాలో చూపించిన మహిష్మతి సామ్రాజ్యం ఎంత భారీగా ఉంటుందో.. అదే తరహాలో హైదరాబాద్‌లో ఈ మురికివాడ సెట్‌ను నిర్మిస్తున్నారు .
ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నాని స్లమ్స్ నుండి ఉన్నత స్థితికి ఎలా ఎదుగుతాడు. అతని ప్రయాణాన్ని చూపించడానికి, మేకర్స్ ఈ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ మురికివాడల మధ్యలో ఒక పెద్ద తోరణం ఉంటుంది, ఇది సినిమా పోస్టర్‌లలో, మొదటి అనౌన్స్‌మెంట్ యూనిట్‌లో కనిపించింది. ఇది నాని సామ్రాజ్యానికి కేంద్రంగా ఉంటుంది. ఈ సెట్ మహీష్మతి సామ్రాజ్యంలా భారీగా నిర్మించారు. 'బాహుబలి' చిత్రం మహిష్మతి రాజదానిలో చూపించిన రాజభవనాలు, పోరాటాలతో ప్రేక్షకులను మైమరపించింది. అదే తరహాలో 'ది పారడైజ్' కూడా రాజభవనాలకు బదులుగా మురికివాడలను భారీ స్థాయిలో చూపించి, ప్రేక్షకుల అనుభవాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మూవీ మేకర్స్.
'దసరా' సినిమాతో రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి, నాని కెరీర్‌లో అత్యధిక గ్రాసర్‌గా నిలిచిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఈ సినిమాతో తన ఖ్యాతిని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన 'ది పారడైజ్' మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. భారీ తారాగణం, అంతర్జాతీయ స్థాయి నిర్మాణం, వినూత్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.