ఆన్​లైన్ ​బెట్టింగ్​కు కుటుంబం బలి.. భార్య, బిడ్డకు విషమిచ్చి చంపిన భర్త

ఆన్​లైన్ ​బెట్టింగ్​కు కుటుంబం బలి.. భార్య, బిడ్డకు విషమిచ్చి చంపిన భర్త
  • అనంతరం తానూ సూసైడ్.. హైదరాబాద్​లో ఘటన

గండిపేట, వెలుగు: ఆన్​లైన్ గేమ్స్, బెట్టింగ్​కు ఓ కుటుంబం బలైంది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఓ వ్యక్తి తన భార్యతోపాటు కుమారునికి కూడా విషమిచ్చి చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్​లోని రాజేంద్రనగర్ లో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది. 

బండ్లగూడలోని జాగిర్ మున్సిపల్  కార్పొరేషన్ రాధా నగర్ లో భార్యాభర్తలు ఆనంద్ (38), ఇందిర (36)  నివసిస్తున్నారు. వారికి కొడుకు శ్రేయాన్స్ (4) ఉన్నాడు. ఆనంద్  పాల వ్యాపారం నిర్వహిస్తుంటాడు. ఆన్ లైన్  గేమ్స్ ఆడుతూ బెట్టింగులు కూడా ఆడాడు. దాదాపు రూ.15 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పులు తీర్చడానికి బంగారం, కారు అమ్ముకున్నాడు. 

ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. పది రోజుల క్రితం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వచ్చి దంపతులకు నచ్చజెప్పారు. ఆన్లైన్ జోలికి వెళ్లవద్దని ఆనంద్ కు సూచించారు. అయితే, మూడు రోజుల క్రితం మరోసారి బెట్టింగ్  ఆడినట్లు సమాచారం. ఇదే విషయమై సోమవారం ఉదయం నుంచి భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. గొడవ జరిగిన సమయంలో ఇందిర.. చేవెళ్ల ప్రాంతంలో మల్కారం గ్రామంలోని తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో తల్లిదండ్రులు ఫోన్ లో సముదాయించారు. 

మరోసారి ఫోన్  చేయగా లిఫ్ట్  చేయకపోవడంతో ఇందిర తల్లిదండ్రులు కంగారుపడి ఆనంద్  ఇంటికి వచ్చి చూశారు. అప్పటికే ఆనంద్, ఇందిర, వారి కుమారుడు చనిపోయారు. దీంతో రాజేంద్రనగర్  పోలీసులకు  సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఇందిర తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.